సున్నం చెరువుపై సమగ్ర విచారణ చేయండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం అల్లాపూర్‌లోని సున్నం చెరువుకు సంబంధించిన భూ వివాదాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రత్యేకాధికారిని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) హోదాలో విచారణ అధికారిని ప్రత్యేకంగా నియమించిన విషయం తెలిసిందే. హైడ్రా సహా ఉన్నతాధికారుల ప్రభావానికి లోను కాకుండా స్వతంత్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. సర్వే ప్రారంభించే ముందు పిటిషన్లతోనూ మాట్లాడాలని సూచించింది. విచారణ జరిపి నివేదిక తయారు చేయడంలో ప్రత్యేకాధికారికి రంగారెడ్డి, మెదక్ మల్కాజిగిరి జిల్లాల నీటిపారుదల, సర్వే, భూ రికార్డులు, రెవెన్యూ శాఖల అధికారులు అవసరమైన సహకారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు కూడా ఇదే ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్‌టీఎల్ నిర్ధారించకుండా అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతోందంటూ ఎస్‌ఐఈటీ మారుతి హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సహా ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో హైడ్రా తాజాగా ఓ మధ్యంతర అప్లికేషన్(ఐఏ) దాఖలు చేసింది. సున్నం చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అనుమతించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు మాదాపూర్ పోలీసుల సాయం తీసుకునేందుకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్లపై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
బోర్లకు విద్యుత్ కనెక్షన్ తొలగించండి..
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఒకవైపు హైడ్రా.. చెరువు సమీపంలో తవ్వకం పనులను నిరాటంకంగా కొనసాగిస్తోందని, మరోవైపు ట్యాంకర్ల ద్వారా చెరువు నుంచి నిరంతరం కలుషితమైన నీటిని తోడి తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తోందన్నారు. హైడ్రా తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్ల వాదనలు అవాస్తవం. పిటిషనర్లు తమ సొంతమని చెప్పుకుంటున్న భూమి హక్కులు, సరిహద్దులపై వివాదం ఉంది. అధికారుల విచారణలో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లోలో విల్లాలున్నా కూడా కూల్చివేస్తాం. చెరువు సహజ స్థితిని పునరుద్ధరించడమే లక్ష్యం. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎఫ్‌టీఎల్ నిర్మాణాలు చేపట్టే వారికి బోర్లు వేసుకునేందుకు అనుమతి ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. నల్లా, విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారని అడిగారు. కలుషిత నీటి తరలింపును నిరోధించేందుకు నిషేధిత ప్రాంతంలోని బోరుబావులకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ప్రత్యేకాధికారిని ఆదేశించారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో వెలసిన అన్ని ఆస్తుల వివరాలను ఇంటి నంబర్లతో సహా సమర్పించాలని స్పష్టం చేశారు. నివేదికలో హైడ్రా తప్పు చేసినట్లు తేలితే, కఠిన చర్యలకు వెనుకాడబోమని తేల్చిచెబుతూ.. విచారణ వాయిదా వేశారు.
ప్రత్యేక అధికారికి హైకోర్టు ఆదేశం
సర్వే ప్రారంభించే ముందుపిటిషనర్లతో మాట్లాడండి
ప్రత్యేకాధికారికి సహకరించాలనివివిధ శాఖలకు సూచన
తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా


