తెలంగాణలో మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌ షాక్‌! | Big Shock to Maoist Party in Telangana DGP Press Meet News Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌ షాక్‌!

Dec 19 2025 7:32 AM | Updated on Dec 19 2025 8:40 AM

Big Shock to Maoist Party in Telangana DGP Press Meet News Updates

మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. వీళ్లలో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు తెలియడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

శుక్రవారం 40 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోతున్నారని.. .. వీళ్లలో ముగ్గురు అగ్రనేతలు ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు పూర్తి వివరాలను పోలీస్‌ బాస్‌ శివధర్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నాం ప్రెస్‌మీట్‌ ద్వారా తెలియజేయనున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన వరకు మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇదేం భారీ లొంగుబాటు కాదు!.  

కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో..  పార్టీకి మూలస్తంభాలుగా ఉన్న అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌లలో మరణించగా.. ఆ ప్రభావంతో ఇంకొందరు స్వచ్ఛందంగా తమ కేడర్‌లతో పెద్దఎత్తున లొంగిపోతున్నారు. పోలీసులు మాత్రం.. మావోయిస్టులకు ప్రజల మద్దతు తగ్గిపోవడం, పార్టీ నెట్‌వర్క్‌ నిర్వీర్యం కావడం, అనారోగ్యాల బారిన పడటం, ఎన్‌కౌంటర్ల భయం, సిద్ధాంతపరమైన విబేధాలు, తెలంగాణ ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలు.. కారణాలంటున్నారు.

ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇటు తెలంగాణలోనూ ఈ మధ్యకాలంలో పలువురు నేతలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. నవంబర్‌ నెలాఖరులో.. ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 

గతంలో.. 2021 సెప్టెంబరులో 52 మంది, ఈ ఏడాది మార్చి 15న 64 మంది, ఏప్రిల్‌ 5న 86 మంది, మే 9న 38 మంది లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు నగదు రివార్డుతోపాటు పునరావాస పథకం కింద ఇతర ప్రయోజనాలను అందిస్తోంది తెలంగాణ పోలీస్‌ శాఖ.

వీళ్లలో ఎవరైనా ఉండొచ్చా?..
తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి మావోయిస్టుల గురించి గత ప్రెస్‌మీట్‌లో.. తెలంగాణలో మిగిలింది 59 మంది మాత్రమేనని స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. ఇందులో కేంద్ర కమిటీలో ఉన్న వాళ్లలో గణపతి, దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, పాక హన్మంతు, పసునూరి నరహరి తెలుగువారే. మరో 10 మంది తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల్లో రాష్ట్రకమిటీ హోదాలో ఉన్నారు. బడే చొక్కారావు తెలంగాణ రాష్ట్రకమిటీ కార్యదర్శి కాగా.. గంకిడి సత్యనారాయణరెడ్డి, కంకణాల రాజిరెడ్డి, ముప్పిడి సాంబయ్య, గీరెడ్డి పవనానందరెడ్డి, జోడే రత్నాభాయ్‌ ఎలియాస్‌ సుజాత, లోకేటి చందర్, శేఖర్‌ ఎలియాస్‌ మంతు, మేకల మనోజ్, కర్రా వెంకట్‌రెడ్డి రాష్ట్ర కమిటీల సభ్యులుగా ఉన్నారు.

తెలంగాణ కమిటీలో ప్రస్తుతం రాష్ట్రానికి చెందినవారు నలుగురు ఉండగా.. మిగిలిన వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే. అలాగే తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఇతర రాష్ట్రాల కమిటీల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తాజా లొంగుబాటులో కీలక నేతలు ఉంటారా? ఉండరా? అనే ఆసక్తి నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement