ట్రా‘ఫికర్’ తీర్చేందుకు ఉమ్మడి చర్యలు
● కీలక నిర్ణయాలు తీసుకున్న అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: సామాన్య ప్రజలకు, వాహనచోదకులకు ఇబ్బందులు కలిగించని విధంగా సిటీ బస్టాప్‌లు ఉండాలని, ట్రాఫిక్ జామ్స్‌కు కారణమవుతున్న వాటిని రోడ్డు వెడల్పు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు మార్చాలని అధికారులు నిర్ణయించారు. బంజారాహిల్స్‌లోని టీజీ ఐసీసీసీలో కొత్వాల్ వీసీ సజ్జనర్ నేతృత్వంలో గురువారం జరిగిన వివిధ విభాగాల ఉమ్మడి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో పోలీసు, జీహెచ్‌ఎంసీ, హైడ్రా, జలమండలి , విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
● ప్రధాన జంక్షన్లలో రద్దీని తగ్గించేందుకు రోడ్ల మరమ్మతులతో పాటు పెండింగ్‌లో ఉన్న జంక్షన్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. వర్షం కురిసినప్పుడు రోడ్లపై నీరు నిలవకుండా ఉండేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంపై చర్చించారు.
● మలక్‌పేట వంటి ప్రాంతాల్లో విజయవంతమైన ’రోబోటిక్ క్లీనింగ్’ విధానాన్ని అన్ని పాయింట్ల వద్ద అమలు చేయనున్నారు. రోడ్డు మధ్యలో ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లను తొలగించడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంపైనా చర్చించారు.
● పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపరచడానికి మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని... దీని కోసం మల్టీ లెవల్ పార్కింగ్ యాప్‘ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
● పురానాపూల్, బహదూర్‌పురా, ఎం.జె. మార్కెట్, మాసాబ్ ట్యాంక్, బేగంపేట వంటి ప్రదేశాలలో రోడ్డు మధ్యలో రెయిలింగ్ లేకపోవడం వల్ల పాదచారులు, వాహనదారులు విచ్చలవిడిగా రోడ్డు దాటుతున్నారు. దీనివల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఆయా ప్రాంతాల్లో రెయిలింగ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
● ఉస్మానియా ఆసుపత్రి తో పాటు నగరంలోని ఇతర స్థలాలలో ఆటోలను విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక స్థలాలను ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
● పోలీసు, మున్సిపల్ విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి సజ్జనర్ పేర్కొన్నారు. ‘వాటర్ బోర్డు, విద్యుత్ తదితర సంస్థలు సమన్వయంతో పనిచేయాలని... క్షేత్ర స్థాయి అధికారులకు అధికారాలను, బడ్జెట్‌ను బదిలీ చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు.
● హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ... వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపుతామని, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
● రోడ్డు తవ్వకాలు జరిపినప్పుడు ప్యాచ్ వర్క్ ఆలస్యం కాకుండా ఉండేందుకు రెండు పనుల్నీ ఒకే కాంట్రాక్టరుకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సైబరాబాద్ సంయుక్త సీపీ గజరావ్ భూపాల్ సూచించారు.
● నగరంలోని సీవరేజ్, డ్రైజేజీ పైప్‌లైన్లను ఇంకా అభివృద్ది చేయడానికి చర్యలు చేపట్టామని, అన్ని శాఖలు కలిసి పని చేసినప్పుడే ట్రాఫిక్, పాదచారుల సమస్యలు తీరుతాయని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు.


