పరిశ్రమలపై విద్యుత్ బిల్లుల పిడుగు!
సాక్షి, సిటీబ్యూరో/కుషాయిగూడ: విద్యుత్ అధికారుల తొందరపాటు నిర్ణయాలు చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల పాలిట పెద్ద శాపంగా మారాయి. డిసెంబర్ నెలలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జారీ చేసిన బిల్లులు పెద్ద ‘షాక్’ ఇచ్చాయి. ఒక్కసారిగా రెట్టింపు బిల్లులు రావడంతో పరిశ్రమల నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపును నిలిపివేసి నిరసన ప్రకటించారు.
సరఫరాకు, రీడింగ్‌కు మధ్య వ్యత్యాసం...
గ్రేటర్ జిల్లాల పరిధిలో సుమారు 50 వేల చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల నిర్వాహకులు ముందే ఎంపిక చేసుకున్న ఫిక్స్‌డ్ లీడ్ పవర్ ఫ్యాక్టర్ రీడింగ్ ప్రకారం నెలవారీ బిల్లును చెల్లించేవారు. అయితే సరఫరాకు, మీటర్ రీడింగ్‌కు మధ్య కొంత వ్య త్యాసం నమోదవుతోంది. ఇప్పటి వరకు ఈ విద్యుత్ నష్టాలను విద్యుత్ సంస్థలే భరిస్తూ వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నష్టాలను తాము భరించలేమని పేర్కొంటూ ఈఆర్‌సీని ఆశ్రయించాయి. ‘లీడ్ పవర్ ఫ్యాక్టర్’కు ఉన్న లాకింగ్ వ్యవస్థను ఎత్తివేసి, ఖర్చు చేసిన ప్రతి యూనిట్‌ను పక్కగా లెక్కించి బిల్లు వసూలు చేయాలని ఈఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది. ఈఆర్‌సీ ఆదేశాల మేరకు మూడు నెలల క్రితం కెపాసిటర్లు లేని ఆయా పరిశ్రమలకు నోటీసులు జారీ చేసింది. లీడ్ పవర్ ఫ్యాక్టర్‌ను అన్‌లాక్ చేసింది. సరఫరాకు, బిల్లింగ్‌కు మధ్య వచ్చిన వ్యత్యాసాన్ని లెక్కించి, ఆ మొత్తాన్ని పరిశ్రమల నుంచి వసూలుకు సిద్ధపడింది. దీంతో పరిశ్రమల నెల వారి విద్యుత్ బిల్లులు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.
డిసెంబర్ నెల బిల్లులు చెల్లించే ప్రసక్తే లేదు...
విద్యుత్ బిల్లులపై పారిశ్రామిక వేత్తలు మండిపడ్డారు. తమకు కనీస అవగాహాన కల్పించకుండా, ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఒక్క సారిగా రెట్టింపు బిల్లులను చేతికి ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తు న్నారు. డిస్కం తీరుతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం చర్లపల్లి సీఐఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు డీఎస్‌రెడ్డి, ఐలా చైర్మన్ గోవిందరెడ్డి, మాట్లాడారు. గత నెల వరకు రూ.పది వేల లోపు వచ్చిన విద్యుత్ బిల్లులు..డిసెంబర్‌లో ఏకంగా రూ.లక్షకుపైగా రావడం ఏమిటని ప్రశ్నించారు. నిజానికి పరిశ్రమలో కెపాసిటర్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయడంతో పాటు నెలవారి బి ల్లును కూడా నియంత్రించుకునే వెసులుబాటు ఉంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఇంజనీరు స్పష్టం చేశారు. ఈ విషయం తెలియక అధిక మొత్తంలో చేతికి అందిన బిల్లులను చూసి పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెందు తున్నారని అభిప్రాయపడ్డారు.
‘లీడ్ పవర్ ఫ్యాక్టర్’ అన్‌లాక్‌తో భారీగా బిల్లులు..
చెల్లించలేమంటున్న నిర్వాహకులు


