సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌లో మారణహోమానికి తెగబడి, పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఐసిస్ ఉగ్రవాది, హైదరాబాదీ సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడానికి అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. టోలిచౌకి అల్ హనస్ కాలనీలో ఉండే అతడి కుటుంబీకులను ప్రశ్నించిన నిఘా వర్గాలు ఈ విషయం గుర్తించాయి. మరోపక్క గడిచిన 27 ఏళ్లలో అతడు నగరానికి రాకపోకలు సాగించిన అంశాల పైనా అధికారులు వివరాలు సేకరించారు.
👉నాంపల్లిలోని అన్వర్ ఉల్ ఉలూం కాలేజీ నుంచి బీకాం పూర్తి చేసిన సాజిద్ 1998 నవంబర్‌లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు. 2000లో ఇటాలియన్ వెనెరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమె ఆ దేశంలోని పర్మనెంట్ రెసిడెంట్‌గా (పీఆర్) ఉన్నారు. దీంతో 2001లో సాజిద్ తన వీసాను పార్ట్‌నర్ వీసాగా మార్చుకున్నారు.
👉ఆ దేశ పర్మనెంట్ రెసిడెంట్‌ను వివాహం చేసుకున్నా... వారితో చట్టబద్ధంగా సహజీవనం చేస్తున్నా ఆస్టేలియా ఈ వీసాను జారీ చేస్తుంది. ఇది కలిగి ఉన్న వాళ్లకు అక్కడ ఉండే, పని చేసే, చదువుకునే, మెడికేర్ సదుపాయం పొందే హక్కులు వస్తాయి. ఆపై పీఆర్‌గా మారిన సాజిద్ 2002లో రెసిడెంట్ రిటర్న్ వీసా తీసుకున్నారు.
👉పీఆర్ హోదా ఉన్న వారికి ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా వచ్చిపోయే పరిమితి ఐదేళ్ల కాలానికే ఉంటుంది. ఆ తరువాతఅవసరమైన వారు దరఖాస్తు చేసుకుని ఈ రెసిడెంట్ రిటర్న్ వీసా పొందాల్సి ఉంటుంది. ఇలా తన పీఆర్ హోదాను సాజిద్ అక్రమ్ కొనసాగించారు.
👉ఆస్ట్రేలియాలో ఓటు హక్కు ఉండాలన్నా, ఆ దేశ పాస్‌పోర్టు పొందాలన్నా, విదేశాల్లో ఆస్ట్రేలియన్ రాయబార కార్యాలయం ద్వారా రక్షణ పొందాలన్నా సిటిజన్‌షిప్ అవశ్యం. ఈ నేపథ్యంలోనే సాజిద్ అనేకసార్లు ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడానికి ప్రయత్నించాడని, అయితే అతడి దరఖాస్తు ప్రతి సందర్భంలోనే తిరస్కరణకు గురైందని కుటుంబీకులు చెప్తున్నారు. అందుకు కారణాలను మాత్రం అతడు ఎప్పుడూ తమతో పంచుకోలేదని పోలీసులకు వివరించారు.
👉ఇతడి కుమారుడైన మరో ఉగ్రవాది నవీద్ అక్రమ్ 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలోనే జన్మించడంతో అక్కడి పౌరసత్వం, ఆ దేశ పాస్‌పోర్టు లభించాయి. గడిచిన 27 ఏళ్లల్లో సాజిద్ ఆరుసార్లు, అక్రమ్ ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్లారని ఇప్పటికే నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ రాకపోకలకు గల కారణాల పైనా స్పష్టత ఇచ్చాయి.
👉2001లో తొలిసారిగా తన భార్యతో కలిసి వచ్చిన సాజిద్ ఇక్కడ కుటుంబీకుల సమక్షంలో తమ సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకున్నారు. 2004లో కుమారుడు నవీద్‌ను టోలిచౌకీలో ఉన్న కుటుంబీకులకు చూపించడానికి తీసుకువచ్చాడు.
👉2009లో తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన సాజిద్... ఆ తర్వాత వచ్చి తల్లితో పాటు కుటుంబీకుల్నీ కలిసి వెళ్లాడు. వారసత్వంగా తనకు సంక్రమించిన ఆస్తి అయిన శాలిబండలోని ఇంటిని విక్రయించడానికి 2016లో వచ్చి వెళ్లాడు.
👉ఈ డబ్బు వెచ్చించే ఆస్ట్రేలియాలోని బోనిరిగ్ ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఇందులో భార్య సైతం కొంత షేర్ కలిగి ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో సాజిద్ తన వాటాను కూడా భార్య వెనెరా పేరుతో బదిలీ చేశాడు.
👉2022 ఫిబ్రవరిలో ఆఖరుసారిగా హైదరాబాద్ వచ్చిన సాజిద్ తన కుటుంబీకుల్ని కలిసి వెళ్లాడు. ఆ సందర్భంలోనే పదేళ్ల కాలపరిమితికి తన పాస్‌పార్ట్‌ను రెన్యువల్ చేయించుకున్నాడు.
సాజిద్ వివరాలు ఇలా..
1998 నవంబర్ 8న స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్.
ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెంట్ వీసా కోసం 27 సార్లు ప్రయత్నించిన సాజిద్.
2000 సంవత్సరంలో వెన్నసాను వివాహం చేసుకున్న సాజిద్.
2001లో పార్ట్నర్ వీసా మార్చుకున్న సాజిద్.
2008లో రెసిడెంట్ రిటన్ వీసా పొందిన సాజిద్.
27 సార్లు ప్రయత్నం తర్వాత రెసిడెంట్ రిటన్ వీసా పొందిన సాజిద్.
27 ఏళ్లుగా ఇండియా రాకపోకలపై ఆరా తీస్తున్న అధికారులు.
2012లో చివరిసారిగా హైదరాబాద్ రాక.
నవీద్ 2019లో సిడ్నీలోని అల్–మురాద్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి అరబిక్ నేర్చుకున్నాడు.
అంతకుముందే.. 2018లో హైదరాబాద్‌లో ఆస్తిని అమ్మి ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుగోలు.
2022 తర్వాత సాజిద్ ఇండియాకు రాలేదు. తండ్రి మరణించినా, కుటుంబంలో ఇతర శుభకార్యాలకు హాజరుకాలేదు.
ఇదిలా ఉండగా.. బాండీ బీచ్ మారణహోమంలో పాల్గొన్న ఇరువురిలో సాజిద్ పోలీసుల కాల్పుల్లో చనిపోగా, నవీద్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడిపై న్యూ సౌత్ వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. వీటిలో 15 హత్యలు, ఒక ఉగ్రవాద చర్యకు సంబంధించినవీ ఉన్నాయి. సాజిద్, నవీద్‌లు వినియోగించిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాజిద్ వినియోగించిన కారులో ఆరు తుపాకులు, రెండు ఐసిస్ జెండాలు ఉన్నాయి.


