పొద్దున్నే కుమ్మేస్తోంది
సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు చలితో గజగజ వణుకుతున్న నగరవాసిని మరోవైపు గాలి కాలుష్యం కమ్మేస్తోంది. తెల్లవారుజామున గ్రేటర్‌లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటోంది. అసలే శీతాకాలం.. ఆపై వాయు కాలుష్యం నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చలిగాలులు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా వాహన, పారిశ్రామిక, ధూళి వంటి గాలి కాలుష్య కారకాలు ‘మితస్థాయి’ నుంచి ‘అనారోగ్య స్థాయికి’ చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పీఎం 2.5 స్థాయిలు విపరీతంగా పెరుగుతున్నాయి. నగరంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు 163గా ఉన్న ఏక్యూఐ.. మర్నాడు ఉదయం 4 గంటలకు 278కు పెరిగింది. అంటే కేవలం 12 గంటల వ్యవధిలోనే నగరంలో వాయు నాణ్యత దాదాపు రెట్టింపు స్థాయిలో పడిపోయింది. మధ్యాహ్నం సమయంలో నగరంలో గాలి నాణ్యత కాస్త మెరుగ్గానే ఉంటున్నా.. రాత్రి 11 గంటల నుంచి క్రమంగా క్షీణిస్తోంది. ప్రధానంగా అమీన్‌పూర్, ఆసిఫ్‌నగర్, బంజారాహిల్స్, బొల్లారం పారిశ్రామిక ప్రాంతం, సెంట్రల్ యూనివర్సిటీ, కాప్రా, కోకాపేట, కొంపల్లి, కోఠి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాలలో గాలి నాణ్యత మరీ తక్కువగా నమోదవుతోంది.
పిల్లలు, వృద్ధులపై ప్రభావం..
గాలి కాలుష్యం పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దగ్గు, ఆస్తమా, అలర్జీ, ఇతరత్రా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు ఆరుబయట తిరగకుండా ఉండాలి. పూర్తిగా సూర్యోదయం వచ్చిన తర్వాతే వాకింగ్, జాగింగ్ వంటి చేయడం ఉత్తమం. మాస్క్ లేకుండా ఔట్‌డోర్ వ్యాయామం చేయకూడదు. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే ఎన్–95 మాస్క్ ధరించాలి.
నియంత్రణకు ఏం చేయాలంటే?
కాలుష్య సవాళ్లను నియంత్రించాలంటే పట్టణ ప్రణాళిక విభాగం, విధానాల అమలు కీలకం. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలతో పాటు పౌరుల సహకారం అత్యవసరం. భూ ఉపరితలాన్ని చల్లదనంగా ఉంచేందుకు గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, పచ్చదనంతో కూడిన ఇంటి పైకప్పులు, భవన నిర్మాణాల్లో హరిత ఉత్పత్తుల వినియోగం తప్పనిసరి చేసేలా నిబంధనల సవరణలు చేపట్టాలి. వీటితో పాటు కాలుష్యం వెదజల్లే కాలం చెల్లిన వాహనాలకు స్వస్తి పలకాలి. ట్రాఫిక్ నియంత్రణ, క్రమబద్ధీకరణ వ్యూహాలను అమలు చేయాలి.
తెల్లవారుజామున భారీగా గాలి కాలుష్యం
వణికిస్తున్న చలి.. పడిపోతున్న వాయు నాణ్యత
12 గంటల వ్యవధిలోనే రెండింతల పెరుగుదల
నగరంలోని పలు ప్రాంతాల్లో క్రమంగా క్షీణదశకు..


