ఆ 103 ఎకరాలు సర్కారువే
సాలార్‌జంగ్ వారసులకు సుప్రీం షాక్
● గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్ భూములపై కీలక తీర్పు
● హైకోర్టు, కింది కోర్టుల ఉత్తర్వులను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం
● జాగీర్ల రద్దుతోనే ఆ భూములు ప్రభుత్వ పరమయ్యాయని స్పష్టీకరణ
● 8 వారాల్లోగా ‘రిజర్వ్ ఫారెస్ట్’ నోటిఫికేషన్ పూర్తి చేయాలని సీఎస్‌కు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్‌లో ఉన్న అత్యంత విలువైన 102 ఎకరాల భూమిపై సాలార్‌జంగ్ వారసుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ భూమి ప్రైవేటు ఆస్తి (అరాజీ–మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు గతంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెడుతూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం గురువారం సంచలన తీర్పు వెలువరించింది.
అసలు వివాదం ఏమిటంటే?
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నం. 201/1లో ఉన్న 102 ఎకరాల భూమిపై మీర్ జాఫర్ అలీఖాన్ (సాలార్‌జంగ్–3 వారసులు) తదితరులు హక్కులు కోరుతూ వచ్చారు. 1832 నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా తమ స్వార్జిత ఆస్తి అని, జాగీర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని వారు వాదించారు. 2014లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమర్థించాయి. దీనిని సవాలు చేస్తూ తెలంగాణ అటవీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జాగీర్ల రద్దుతోనే సర్కారు పరం: 1949లో జాగీర్ల రద్దు రెగ్యులేషన్ వచ్చినప్పుడే సదరు భూములు ప్రభుత్వంలో అంతర్భాగమయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. 1953లోనే రెవెన్యూ బోర్డు ఈ భూమిని అటవీ శాఖకు బదలాయించిందని, అప్పటి నుంచి అది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధీనంలోనే ఉందని పేర్కొంది.
ఆ పత్రాలు చెల్లవు: సాలార్‌జంగ్ వారసులు చూపించిన 1954 నాటి జాగీర్ అడ్మినిస్ట్రేటర్ లేఖలు, ఇతర పత్రాలు నమ్మదగ్గవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం జిరాక్స్ కాపీల ఆధారంగా, అసలు రికార్డులను సరిగా పరిశీలించకుండా కింది కోర్టులు తీర్పునివ్వడం సరికాదని తప్పుబట్టింది.
అధికారులు పరిధి దాటారు: టైటిల్ (యాజమాన్య హక్కుల) వివాదాలను తేల్చే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని, సమ్మరీ ఎంకై ్వరీ చేసే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌కు ఆ అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని మండిపడింది.
అటవీ శాఖ నిర్లక్ష్యం: ఈ కేసులో సరైన సమయంలో సరైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో అటవీ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శించారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
మరో అప్పీల్ కూడా కొట్టివేత
ఇదే భూమిపై హక్కులు కోరుతూ ఆగా సయ్యద్ నయీమతుల్లా షుసీ్త్ర దాఖలు చేసిన మరో పిటిషన్‌ను (సివిల్ అప్పీల్ నం. 9997/2025) కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ భూమి ప్రభుత్వానిదేనని తేల్చినందున, ఇతరుల వాదనలకు ఆస్కారం లేదని తేల్చిచెప్పింది.
8 వారాల్లోగా పూర్తి చేయండి..
నగరాల్లో పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేసింది. ఈ 102 ఎకరాల భూమిని ’రిజర్వ్ ఫారెస్ట్’గా ప్రకటిస్తూ, తెలంగాణ ఫారెస్ట్ చట్టంలోని సెక్షన్ 15 కింద పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు కంప్లయన్స్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని స్పష్టం చేసింది.


