నేరుగా బల్దియా ఖజానాకే..
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో విలీనమైన 20 మున్సిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఆస్తిపన్నులు, దుకాణాల ట్రేడ్ లైసెన్సుల ఫీజులు నేరుగా జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరనున్నాయి. ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్సు ఫీజు, వేకెంట్ ల్యాండ్ టాక్స్(వీఎల్‌టీ) ఫీజు కూడా జీహెచ్‌ఎంసీ ఖజానాలో చేరేలా జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. వెట్‌సైట్‌లో పూర్వ పురపాలికల (ఎర్‌స్ట్‌వైల్ యూఎల్‌బీస్) పేరిట కొత్త విండోను అందుబాటులోకి తెచ్చారు. దాని ద్వారా జీహెచ్‌ఎంసీలో కలిసిన పురపాలికల్లోని వారు తమ ఆస్తిపన్నుకు సంబంధించిన పీటీఐఎన్ ద్వారా లేదా ఇంటినెంబరు ద్వారా చెల్లించాల్సిన ఆస్తిపన్ను వివరాలు చూసుకోవడంతో పాటు వెబ్‌సైట్ నుంచే ఆన్‌లైన్ ద్వారా నేరుగా సదరు పన్ను చెల్లించే సదుపాయం కల్పించారు. ఆస్తిపన్ను జాబితాలో నమోదు కాని.. కొత్త భవనాల సెల్ఫ్‌అసెస్‌మెంట్, భవన యాజమాన్య బదిలీకి సంబంధించి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంచారు. దుకాణాలకు సంబంధించి ట్రేడ్‌లైసెన్సుల ఫీజులు కూడా ఆన్‌లైన్ ద్వారా చెల్లించే సదుపాయం కల్పించారు.
జిల్లాల వారీగానూ..
జీహెచ్‌ఎంసీలో విలీనమైన పురపాలికలు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధుల్లో ఉండటంతో జిల్లాల వారీగా వివరాలు పొందుపరిచారు.
యథాతథంగానే ఆస్తిపన్ను
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను విధింపు ఒక విధంగా ఉండగా, పురపాలికల్లో మరో విధంగా ఉంది. ఆ విధానాలు ప్రస్తుతానికి యథాతథంగానే కొనసాగనున్నాయి. ఒకే విస్తీర్ణం భవనానికి జీహెచ్‌ఎంసీ కంటే పురపాలికల్లో ఆస్తిపన్ను ఎక్కువగా ఉంది. అవి జీహెచ్‌ఎంసీలో విలీనమైనందున వాటికి తగ్గింపు ఉండదని తెలిసింది.
ఎంతొస్తుందో ఏమో?
జీహెచ్‌ఎంసీలో విలీనమైన పురపాలికల ద్వారా ఎంత ఆదాయం జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరనుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు అధికారులు. నాలుగు నెలల్లోపునే ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటి వరకు వాటిల్లో ఎంత ఆస్తిపన్ను వసూలైందో, ఇంకా రావాల్సింది ఎంతో తెలియదు. వాటి ఆస్తిపన్ను డిమాండ్, వసూలైన మొత్తం.. ఇంకా రావాల్సిన ఆస్తిపన్ను తదితర వివరాలు పంపించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీకి వచ్చే ఆదాయం సంగతి ఏమోగానీ వ్యయం మాత్రం భారీగా పెరగనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎంతో వ్యయం కానుందని చెబుతున్నారు.
విలీన పురపాలికల ఆదాయం చేరేలా ఏర్పాట్లు
ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సు ఫీజు చెల్లింపులు
జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో సదుపాయం


