ఈవీతో ఆదా!
సాక్షి, సిటీబ్యూరో: ఎలక్ట్రిక్ బస్సులతో గ్రేటర్ ఆర్టీసీకి భారీ ఊరట లభించనుంది. దశలవారీగా అందుబాటులోకి రానున్న ఈవీలతో ఆర్టీసీకి రోజుకు రూ.కోటి వరకు ఆదా కానుంది. ఇంధనం కోసం వినియోగిస్తున్న ఖర్చు చాలా వరకు తగ్గనుంది. ఇప్పటికే సుమారు 300 కొత్త బస్సులు నగరంలోని పలు మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. వచ్చే మార్చి నాటికి మరో 200 బస్సులు రానున్నాయి. మరోవైపు పీఎం ఈ– డ్రైవ్ పథకంలో భాగంగా నగరంలోని 25 డిపోల్లోని డీజిల్ బస్సులను తొలగించి 2000 ఈవీలను ప్రవేశపెట్టనున్నారు. దీంతో 2027 నాటికి మొత్తం 2,500 ఎలక్ట్రిక్ బస్సులు నగరంలో పరుగులు తీస్తాయి. ప్రస్తుతం ఆర్టీసీ సొంత బస్సులతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తుండగా, ఈ బస్సుల స్థానంలో రానున్న ఎలక్ట్రిక్ బస్సులన్నింటిని అద్దెప్రాతిపదికన సమకూర్చుకుంటారు. దీంతో ఈ బస్సుల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుముఖం పట్టనుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
కిలోమీటర్‌కు రూ.65..
ప్రస్తుతం గ్రేటర్‌లోని సుమారు 1,050 రూట్లలో సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజూ సుమారు 5 లక్షల కిలోమీటర్ల వరకు నడుస్తున్నట్లు అంచనా. ఇప్పుడున్న డీజిల్ బస్సులపై ఆర్టీసీ ఒక కిలోమీటర్‌కు రూ.85 చొప్పున ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన మొత్తం బస్సులపై రోజుకు రూ.6 కోట్ల నిర్వహణ వ్యయమవుతున్నట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ ఆర్టీసీకి ప్రస్తుతం రూ.6.2 కోట్ల వరకు దాయం లభిస్తుండగా అందులో రూ.6 కోట్లు బస్సుల నిర్వహణకే వెచ్చించాల్సివస్తోంది. దీంతో నిత్యం కేవలం రూ.20 లక్షలు మాత్రమే మిగులుబాటవుతోంది. ఒకప్పుడు పీకల్లోతు నష్టాలతో నడిచిన గ్రేటర్ ఆర్టీసీకి ఇది ఒకింత ఊరట కలిగించేదే. కానీ.. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల మరింత ఆదాయం లభిస్తుందని పేర్కొంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల విద్యుత్ చార్జీలు, ఇతర అవసరాల కోసం ఒక కిలోమీటరుకు రూ.65 వరకు ఖర్చవుతుంది. దీంతో మొత్తం బస్సులపై సుమారు రూ.5 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇలా పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీకి ప్రతి రోజు సుమారు రూ.కోటి ఆదా అయ్యే అవకాశం ఉంది.
నూతన బస్సుల కోసం 10 కొత్త డిపోలు
మరోవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు జీహెచ్‌ఎంసీ విస్తరణలో భాగంగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ విస్తరణకు సైతం చర్యలు చేపట్టారు. ఈ మేరకు కొత్త జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 2000 చ.కి.మీ వరకు ఉన్న కాలనీలు, నివాస ప్రాంతాలకు ప్రజారవాణా సదుపాయాలను విస్తరించేందుకు కొత్తగా 10 డిపోలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నానక్‌నాంగూడ, కోకాపేట్, నార్సింగి, గచ్చిబౌలి, శంషాబాద్, పటాన్‌చెరు, కీసర, కుత్బుల్లాపూర్, బోరబండ, అబ్దుల్లాపూర్‌మెట్‌లలో కొత్త డిపోలు రానున్నాయి. దీంతో గ్రేటర్‌లోని మొత్తం డిపోల సంఖ్య 35కు చేరనుంది.
గ్రేటర్‌లో దశలవారీగా అందుబాటులోకి 2,500 ఎలక్ట్రిక్ బస్సులు
రూ.6 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గనున్న నిర్వహణ భారం


