ఒంటరికి జంటగా..
● జంతువులకు తోడు కల్పించేందుకు జూ అధికారుల ప్రయత్నాలు
నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల సాహచర్యం కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణుల సంతతిని పెంచేందుకు.. సాంగత్యం పంచుకునేలా ఇతర ప్రాంతాల్లోని జూలలో ఉన్న ఆడ, మగ జంతువులను ఇక్కడి జూకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా జంతువుల సంతానోత్పత్తి పెరగడంతో పాటు విరహ వేదనతో పిచ్చిగా ప్రవర్తిస్తున్న జంతువులను మచ్చిక చేసుకోవాలని భావిస్తున్నారు. అలాగే తోడులేక ఒంటరిగా ఉన్న కొన్ని వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నట్లు గుర్తించిన యంత్రాంగం ఈ దిశగా ఆలోచన చేసింది. బబ్లీ అనే జిరాఫీ మరణంతో సన్నీ అనే మగ జిరాఫీ ఒంటరిగా మిగిలిపోయింది. దీనికి తోడుగా ఆడ జిరాఫీని తీసుకురావడానికి జూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే మైసూర్ జూలోని ఆడ జిరాఫీని హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు జూ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీం తెలిపారు. హమడ్రియాస్ బబూన్.. ఒక రకమైన కోతి ఇది. దీనికి ఆడ తోడును మైసూర్ జూ నుంచి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మగ దేవాంగ పిల్లికి ఆడ దేవాంగ పిల్లిని తీసుకువచ్చేందుకు సైతం ఇతర జూలను సంప్రదిస్తున్నారు. గ్రేటర్ రియా అనే మగ పక్షికి తిరువనంతపురం ఆడ పక్షిని తీసుకురావడానికి చర్చలు జరుపుతున్నారు. కోతి జాతికి చెందిన ఆడ మకాక్ తోడు కోసం త్రిపుర రాష్ట్రం అగర్తలా జూ నుంచి మగ మకాక్‌ను తీసుకువస్తామని జూ క్యూరేటర్ జె.వసంత పేర్కొన్నారు. – సాక్షి, సిటీబూరో
ఒంటరికి జంటగా..
ఒంటరికి జంటగా..
ఒంటరికి జంటగా..
ఒంటరికి జంటగా..


