సాక్షి, వనపర్తి: వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఓడిపోయేందుకు పార్టీల్లోని కొందరు నేతలే కారణమని అన్నారు. పరోక్షంగా మాజీ మంత్రి చిన్నారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమేంటో ఆ వివరాలన్నీ పీసీపీకి, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తాను. వనపర్తిలో నేను ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ కామెంట్స్ చేశారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మెగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘మూడు విడతలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము ఈ రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బాగా ఆదరించారు. వనపర్తి నియోజకవర్గంలోని 140 పంచాయతీల్లో 85 సీట్లు కాంగ్రెస్‌కు వచ్చాయి. 60.66% ఓటు శాతం వచ్చింది. బీఆర్ఎస్‌కు 51 గ్రామ పంచాయతీ సీట్లు రాగా ఓటు శాతం 36% వచ్చింది. అంటే బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పుంజుకుంది అనేది అందరూ గ్రహించాలి. గ్రామ పంచాయతీ వరకు చూస్తే కాంగ్రెస్‌కు 92407 ఓట్లు వచ్చాయి.. బీఆర్ఎస్‌కు 59788 ఓట్లు వచ్చాయి. రెండింటిని చూస్తే వారికన్నా కాంగ్రెస్‌కు 35.09% అధికంగా వచ్చాయి. ఎన్నికల ఓటు పర్సంటేజ్ విషయంలో బీఆర్ఎస్‌కు ఓటు శాతం తగ్గింది. వచ్చే ఎన్నికల్లో ఇంకా వాళ్ళు కిందికి పడిపోవడం ఖాయం.
మా కాంగ్రెస్ పెద్ద మనిషి చిన్నారెడ్డి నియోజకవర్గంలోనే 15 గ్రామాలలో కావాలని పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ వాళ్లకు సపోర్ట్ చేశారు. బీఫామ్స్ విషయంలో ఆయనకు కాకుండా నాకు వచ్చిందని కక్ష పెంచుకుంటే నామీద కోపం తీర్చుకోవాలి కానీ ఇలా పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ అభ్యర్థులను ఓడించడం సబబు కాదు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం వనపర్తి ప్రజలు అందరు గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయం. చిన్నారెడ్డి పంచాయతీ ఎన్నికలలో ఓటర్లకు ఫోన్లు చేసి కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దు.. బీఆర్‌ఎస్‌కు ఓటు వేయమని చెప్పిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసిందని అభ్యర్థులను ఓడించారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


