బిల్లులు ఇవ్వకుండా సర్పంచ్‌లను చంపింది మీరు కాదా?
జడ్చర్ల: బీఆర్‌ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వకుండా వారు చనిపోవడానికి కారణం మీరు కాదా అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కమీషన్‌ల కోసం ఇరిగేషన్ బిల్లులు ఇచ్చిన మీరు సర్పంచ్‌ల బిల్లులను మాత్రం పెండింగ్‌లో పెట్టారని, బిల్లులు రాకపోవడంతో అప్పుల గుది బండతో కొందరు గుండెపోటుకు మరి కొందరు ఆత్మహత్యలకు పాల్పడలేదా అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తనను గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రజలను ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేసి గెలిచారని, ఆయననే బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్న బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థులు కూడా గ్రామాలలో కన్నీళ్లు పెట్టి చచ్చిపోతామంటూ ఎమోషనల్ సీన్ పండించి గెలుపునకు ప్రయత్నించారని విమర్శించారు. అలాంటి సర్పంచ్‌లకు తాము నిధులు ఇవ్వకుండా చంపేస్తామని ప్రచారంలో చెప్పింది వాస్తవమేనని, తాను కత్తితో పొడిచి చంపుతానని అనలేదు కదా అన్నారు. బడికి వెళ్లే తమ పిల్లలను సైతం ప్రచారంలో తిప్పి ఓటర్ల కాళ్లు మొక్కించి ఓట్లు అభ్యర్థించారని ఆరోపించారు. ఇంత చేసినా 10 శాతం సర్పంచ్‌లను గెలిపించుకోలేక పోయారని ఎద్దేవ చేశారు. ఇండిపెండెంట్‌లుగా గెలిచిన వారిని బీఆర్‌ఎస్ తమ ఖాతాలో వేసుకుని జబ్బలు చరుచుకుంటున్నారని అన్నారు. తాము సింగిల్‌గా పోటీ చేసి జడ్చర్లలో 188 సర్పంచ్ స్థానాలకు 108 గెలిచామన్నారు. మరో 35 మంది స్వతంత్రులు తమకు టచ్‌లో ఉన్నారని అన్నారు. అవినీతి అక్రమాలకు అతీతంగా అభివృద్ధిని కాంక్షించే బీఆర్‌ఎస్ సర్పంచ్‌లను పార్టీలోకి తీసుకుంటామని అన్నారు. ఏ పార్టీకి చెందిన సర్పంచులయినా సరే భూకబ్జాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. తనకు సంబంధించిన రూ.5 కోట్ల ఎస్‌డీఎఫ్ నిధులను కాంగ్రెస్ సర్పంచ్‌లకు కేటాయిస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇళ్ల కేటాయింపు ఉంటుందని, వారిపై సర్పంచ్‌ల పెత్తనం ఉండబోదన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోప్లాపూర్ యాదయ్య, పట్టణ అధ్యక్షుడు మినాజ్ పాల్గొన్నారు.


