పైసా పాయె.. పరువు పోయె
● మనోవేదనలో ఓటమి పాలైన
అభ్యర్థులు
● రూ.లక్షలు ఖర్చు పెట్టినా..
● ప్రజలు ఎందుకు ఆదరించలేదని ఆరా
అచ్చంపేట: ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో గట్టెక్కుతామనే అతి విశ్వాసంతో మూడో విడతలో పోటీకి దిగిన పలువురు ఓటమితో డీలాపడ్డారు. ప్రజల్లో తమకున్న గుర్తింపు ఓట్లు తెచ్చి పెడుతుందని, పార్టీల మద్దతు ఉంటే ఇక విజయం నల్లేరుపై నడికే అని భావించిన పలువురు ఓటమితో భంగపడ్డారు. ఆయా పార్టీల్లోని సర్పంచ్ అభ్యర్థులు తమ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో తాము చేసిన పనులు చూసి ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారని భావించి పలువురు తాజా మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు ఎన్నికల్లో పోటీకి దిగినా వారిని ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల్లో అప్పులు చేసి ఖర్చు పెట్టినా ఓటమి చెందడంతో పైసా పాయే, పరువు పాయే అని పలువురు వాపోతున్నారు.
అప్పులు చేసి మరీ..
పలువురు సర్పంచ్ పదవిపై ఆశతో ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయినా ప్రజలు ఆదరించలేదు. దీంతో ఇటు పదవి రాకుండా పోగా.. అటు అప్పులు మిగిలాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలో దారిలేక అయోమయంలో ఉన్నారు.
ఓడిన వారు
ఎంపీటీసీ పదవిపై గురి
సర్పంచ్ పదవులకు పోటీ చేసి ఓటమిపాలైన వారు త్వరలో వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగాలని యోచిస్తున్నారు. ప్రజలు తమపై సానుభూతి చూపుతారనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ప్రజల వైపు నుంచి తమకు హామీలు వస్తున్నట్లు ఓటమి పాలైన వారు పేర్కొంటున్నారు. ఓటమితో నేర్చుకున్న గుణపాఠం ఒక అనుభవమంటున్నారు. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థులను ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.


