కోవర్ట్స్.. రెబల్స్!
నారాయణపేట నియోజకవర్గం, మహబూబ్‌నగర్ జిల్లా పరిధి కోయిల్‌కొండ మండలంలో పేరు చివర నగర్ ఉన్న గ్రామానికి రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన వ్యక్తి ఓటమి పాలయ్యాడు. ఈయన ఓటమి వెనుక స్థానిక ‘హస్తం’ నాయకులే ఉండడం గమనార్హం. లోపాయికారిగా బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఇది గ్రహించక అంతా ఖర్చు చేసిన సదరు అభ్యర్థి తలపట్టుకుంటున్నాడు. ‘నా పనేందో నేను చేసుకుంటున్నా. హైదరాబాద్‌కు వచ్చి నన్ను ఒప్పించి వారే సర్పంచ్‌గా నిలబెట్టారు. వారే ఖర్చు చేయించారు. చివరకు వారే ఓడించారు. నా కొంప ఆర్సిండురోయ్.’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే మండలంలో మరో గ్రామంలో సైతం ఇలాగే జరిగినట్లు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పల్లె రాజకీయాలు ఎప్పుడూ విభిన్నమే. స్థానిక పరిస్థితులు ప్రభావం చూపించే ఈ ఎన్నికలు ఎప్పటికై నా ఆసక్తికరమే. పార్టీ గుర్తులపై కాకుండా జరిగే సంగ్రామమైనప్పటికీ.. వాటి ప్రభావం ఊరి ప్రజలపై చెరగని ముద్ర వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తుందనే దానికి గతంలో వెలువడిన ఫలితాలే నిదర్శనం. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ సైతం పల్లె పోరులో పైచేయి సాధించింది. కానీ వరుసగా అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటడం హస్తం నేతలను బెంబేలెత్తిస్తోంది. ఆశించిన ఫలితాలు రాకపోవడం వారిని కుంగదీస్తోంది. దీనికంతటికీ పార్టీలోని కోవర్టులు, రెబల్స్ కారణం కాగా.. ఎవరు గెలిచినా తమ వారే అన్నట్లు వ్యవహరించడం కూడా ఫలితాలపై ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో పాటు ‘అధికార’ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కోవర్టులు, రెబల్స్ ప్రభావం చూపిన తీరుపై ‘సాక్షి’ కథనం..
రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 137 జీపీలు ఉండగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. 69 మంది హస్తం మద్దతుదారులు గెలుపొందగా.. 44 మంది కారు, ఆరు చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అధిక జీపీల్లో బీఆర్‌ఎస్, బీజేపీ ఒకరికొకరు మద్దతు తెలుపుకోగా.. మొత్తంగా 50 స్థానాల్లో గెలుపొందారు. స్వతంత్రులు పది మంది విజయం సాధించగా.. వీరిలో ఎక్కువగా ఉమ్మడి (కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ) అభ్యర్థులే ఉన్నారు. వీరికి అధికార పార్టీలోని గ్రామ, మండలస్థాయి ముఖ్యులు లోపాయికారిగా సహకరించినట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్‌లో రెబల్స్‌తో పాటు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు సైతం గెలుపు ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
ఇంకా ఎక్కడెక్కడ అంటే..
నారాయణపేట నియోజకవర్గంలో 95 జీపీలు ఉన్నాయి. ఇందులో 43 చోట్ల కాంగ్రెస్, 16 పంచాయతీల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. హస్తం ఆధిక్యతను సాధించినా.. ఇక్కడ రెబల్స్ ఐదుగురు, ఉమ్మడి అభ్యర్థులు తొమ్మిది మంది విజయం సాధించారు. గెలుపొందిన ఉమ్మడి అభ్యర్థుల్లో అధిక శాతం మందికి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు సహకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇతర పార్టీల సర్పంచ్ అభ్యర్థులతో ముందుగానే లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. సొంత పార్టీ అభ్యర్థులకు వెనున్నపోటు పొడిచినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కోయిల్‌కొండ మండల పరిధిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ముఖ్యనేతకు సంబంధించి మండలాల వారీగా షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న వారి నిర్వాకం వల్ల పలు జీపీలు చేజారిపోయినట్లు తెలుస్తోంది.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో 172 గ్రామపంచాయతీలు ఉండగా.. శంకరాయపల్లి తండి మినహా అన్నింటిలో ఎన్నికలు జరిగాయి. 83 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా.. ఆ పార్టీ ఆధిక్యతను కనబరిచింది. బీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇవ్వగా.. 72 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేకు షాడో నేతగా వ్యవహరిస్తున్న ఒకరి నిర్వాకం.. పాత కాంగ్రెస్ నాయకులకు దక్కని ప్రాధాన్యం, నియోజకవర్గంలో ఒంటెద్దు పోకడలు ఫలితాలపై ప్రభావం చూపించినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చజరుగుతోంది.
వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు షాడో నేతలుగా వ్యవహరిస్తున్న వారికి ఈ పంచాయతీ ఎన్నికల్లో షాక్ తగిలింది. గోపాల్‌పేట మండలంలోని ఓ నాయకుడి స్వగ్రామం, పెబ్బేరు మండలంలోని మరో గ్రామం, ఖిల్లాఘనపురం మండలంలోని ఓ పల్లెలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఆయా ప్రాంతాల్లో అధికార నేతకు షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలతో పాటు కాంగ్రెస్ అభిమానులు సైతం కారు బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లు తెలుస్తోంది.
గద్వాల నియోజకవర్గంలో మొత్తంగా కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వర్గాలకు చెందిన వారే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ఇందులో బండ్ల వర్గం సత్తా చాటినట్లు తెలుస్తోంది.
నారాయణపేట మండలం ఓ జీపీ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. పాత కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేశారు. కొత్త కాంగ్రెస్ నుంచి ఓ నాయకుడు తన భార్యతో నామినేషన్ వేయించి.. ఒత్తిళ్లతో విరమించుకున్నాడు. తాను 8వ వార్డులో బరిలో నిలిచాడు. తన వార్డు వరకే ఆ నాయకుడు పరిమితం కాగా.. అక్కడ గెలుపొందాడు. కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారు ఓడిపోగా.. బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు.
నా కొంప ఆర్సిండురోయ్..!
కొల్లాపూర్: రెబల్స్, వర్గ పోరుతో..
మక్తల్: ‘వాకిట’ మెజార్టీపై ఎఫెక్ట్..
మక్తల్ నియోజకవర్గంలో నారాయణపేట జిల్లాలో మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఊట్కూరు.. వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 138 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 70, బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు 31 మంది గెలుపొందారు. హస్తం ఆధిక్యం సాధించినా.. పది స్థానాల్లో అదే పార్టీకి చెందిన రెబల్స్ విజయం సాధించారు. రెబల్స్ ప్రభావానికి ఇది నిదర్శనం కాగా.. ఐదారు స్థానాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ మధ్య పోటీతో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు లాభించింది. అంతేకాకుండా పలు చోట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులే.. ఆ పార్టీ బలపరిచిన వారికి కాకుండా లోపాయికారిగా కారు, కమలం బలపరిచిన వారికి సహకరించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌ను దెబ్బతీసింది వీరే..
పలు చోట్ల షాడోల తీరు సైతం..
నారాయణపేట, వనపర్తి,
జడ్చర్లలో అధిక ప్రభావం
మంత్రి జూపల్లి ఇలాకా
కొల్లాపూర్‌లో అత్తెసరు ఫలితాలే..
మరో అమాత్యుడి సెగ్మెంట్
మక్తల్‌లో మెజార్టీపై ఎఫెక్ట్
గద్వాల నియోజకవర్గంలో విభిన్నం.. స్వపక్షంలోని వర్గాలదే విజయం
కోవర్ట్స్.. రెబల్స్!


