పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
● రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
● కలెక్టర్ విజయేందిర బోయి
దేవరకద్ర: ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అలాగే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. గురువారం దేవరకద్ర మున్సిపాలిటీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి ఎక్కువగా పేదలు వైద్యసేవల కోసం వస్తారని, వారికి మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వపరంగా రోగులకు అన్ని వైద్య పరీక్షలు చేయడంతో పాటు సరైన మందులను అందించాలని కోరారు. ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. దేవరకద్ర పీహెచ్‌సీని ఆదర్శ ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చిన గర్భిణితో మాట్లాడి.. నెలనెలా చేస్తున్న వైద్య పరీక్షల వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిమోగ్లోబిన్ తగ్గితే వచ్చే సమస్యల గురించి వివరించి, పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేసి, లేబర్‌రూమ్‌లో సౌకర్యాలను పరిశీలించారు.
● దేవరకద్రలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. ఈ సందరభంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు ప్రహరీ లేదని, సైన్స్ ల్యాబ్ సుదుపాయం కల్పించాలని కలెక్టర్‌ను కోరగా.. ఆమె సానుకూలంగా స్పందించారు.


