సర్పంచ్‌లు బాధ్యతగా పనిచేయాలి
ఆత్మకూర్: కొత్త సర్పంచ్‌లు పదవికి కలంకం తీసుకురాకుండా బాధ్యతాయుతంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి కోరారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మండలంలో గెలుపొందిన సర్పంచ్, వార్డుసభ్యులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను అత్యధిక స్థానాల్లో గెలిపించి తన ఉత్సాహాన్ని రెట్టింపు చేశారని, ఇదే ఉత్సాహాన్ని ఇకముందు జరిగే ఎన్నికల్లో చూపాలని కోరారు. మండలానికి ఇప్పటి వరకు రూ.250 కోట్లు మంజూరయ్యాయని.. రానున్న మూడేళ్లలో మరో రూ.300 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 500 ఇళ్లు మంజూరు చేయగా.. మరో 500 ఇళ్లు కేటాయిస్తానని ప్రకటించారు.
జూరాల వంతెనతో మహర్దశ..
జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో హైలేవల్ వంతెన నిర్మాణ పనులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించగా.. పనులు కొనసాగుతున్నాయని, ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. రూ.23 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, రూ.15 కోట్లతో సీసీ రహదారులు, రూ.5 కోట్లతో ఇండోర్ స్టేడియం, మార్కెట్‌యార్డు భవనం, షాపింగ్ కాంప్లెక్స్, చెరువుకట్ట ఆధునీకరణ, ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తదితర పనులు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, గంగాధర్‌గౌడ్, బాలకృష్ణారెడ్డి, మణివర్ధన్‌రెడ్డి, నాగేష్, దామోదర్, సాయిరాఘవ, మహేష్, షాలం, జుబేర్, కరణ్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
భూగర్భ విద్యుత్ కేంద్రం సొరంగం
కొండపై మంటలు
దోమలపెంట: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం నీళ్లు బయటకు వెళ్లే సొరంగం (ఎగ్జిట్)పైన ఉన్న కొండ వద్ద గురువారం మంటలు వ్యాపించాయి. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సొరంగం కొండపైన పెరిగి ఉన్న ఎండిన గడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి బీడి, సిగరెట్ తాగి పడేయడం వలన మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నామని భూగర్భ విద్యుత్ కేంద్రం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మల్లికార్జున తెలిపారు. కేంద్రం ఫైర్ సిబ్బంది మొత్తం మంటలు ఆర్పేందుకు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు.
సర్పంచ్‌లు బాధ్యతగా పనిచేయాలి


