లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి
మహబూబ్‌నగర్ క్రైం: కోర్టులో రాజీ పడదగిన కేసులన్నింటినీ రాజీ మార్గంలో ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకొని కక్షిదారులు కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత తెలిపారు. గురువారం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో అన్నిరకాల సివిల్, క్రిమినల్, భూతగాద, కుటుంబ వివాద కేసులు, మోటార్ వెహికిల్ కేసులను ఇద్దరు రాజీపడి కేసులను పరిష్కరించుకోవాలన్నారు. లోక్ అదాలత్‌లో రాజీపడిన కేసులో కోర్టు ఫీజు వాపసు ఇవ్వబడుతుందన్నారు. రాజీపడ్డ దగ్గ క్రిమినల్ కేసులన్నింటినీ పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా 5 బెంచీలు ఏర్పాటు చేశామని, జిల్లాకోర్టులో 3 బెంచీలు, జడ్చర్లలో 2బెంచీలలో కేసుల సివిల్, మోటార్ వెహికిల్, ఫ్యామిలీ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందులో ఏ పార్టీ గెలిచినట్టు, ఒకరు ఓడినట్టు ఉండదని, లోక్ అదాలత్ ఇరు వర్గాలను సమన్యాయం చేసే విధంగా చేసినటువంటి కార్యక్రమం అని వివరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర పాల్గొన్నారు.
ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) ముగియడానికి మూడు నెలలే మిగిలినందున ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో అధికారు లు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు కేవలం 24.23 శాతమే ఆస్తిపన్ను వసూలైందన్నారు. ప్రత్యేక బృందాలు ప్రతినిత్యం అన్ని డివిజన్ల లో ఇంటింటికీ తిరిగి ఆస్తిపన్నుతో పాటు నల్లా బిల్లులు సకాలంలో చెల్లించాలని నగర ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా మొండి బకాయిదారులకు తక్షణమే నోటీసులు అందజేయాలన్నారు. సమావేశంలో ట్రెయినీ మున్సిపల్ కమిషనర్ దిలీప్‌రెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, మేనేజర్ వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జ్ ఎంఈ విజయకుమార్, డీఈఈలు నర్సింహ, హేమలత, ఏఈలు , శానిటరీ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌జీ, లక్ష్మయ్య, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లుకు రవాణా చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 191 వరి ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా 1.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దాదాపు రూ.260 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా ఇప్పటివరకు రూ.219 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసినట్లు చెప్పారు. మిగిలిన రూ.40 కోట్లను సంబంధించి ట్యాబ్ ఎంట్రీ చేసి, వెంటనే చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఐకేపీ, పీఏసీఎస్ ఏజెన్సీలను ఆదేశించారు.ధాన్యం కొనుగోలుపై ఎప్పటికప్పుడు జిల్లా పౌర సరఫరాల అధికారి, పౌర సరఫరాల సంస్థ డీఎంలు పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఓ నర్సింహులు, పౌర సరఫరాల సంస్థ డీఎం రవినాయక్, అధికారులు గంప శ్రీనివాస్, టైటస్‌పాల్, బాలమణి, హైమావతి, తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి


