బాబు ఆర్థిక విధ్వంసం.. ఎల్లో మీడియా మాటల్లో! | KSR Comments On CBN Govt And Yellow Media | Sakshi
Sakshi News home page

బాబు ఆర్థిక విధ్వంసం.. ఎల్లో మీడియా మాటల్లో!

Dec 19 2025 10:32 AM | Updated on Dec 19 2025 10:36 AM

KSR Comments On CBN Govt And Yellow Media

‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు నానాటికీ మరింత అధ్వాన్నంగా మారిపోతుంది. తప్పుడు లెక్కలతో తీరని ద్రోహం జరుగుతోంది’.. ఈ మాటలు అంటోంది ప్రతిపక్షాలు కాదు.. కూటమి ప్రభుత్వానికి దన్నుగా నిలిచే ఎల్లోమీడియా!. ఒకపక్కమే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదని ఒకసారి.. జీఎస్డీపీ బ్రహ్మాండమని ఇంకోసారి చెబుతూంటే.. ఎల్లోమీడియా ఇలా వాస్తవాలు వెల్లడించి పరువు బజారున పడేసింది.

అయితే.. ఈ కథనంలో ఎక్కడా చంద్రబాబును తప్పు పట్టలేదు లెండి. తప్పంతా అధికారులదే అన్నట్టుగా ఈ కథనం సాగింది. జీఎస్డీపీ, తలసరి ఆదాయాలు బాగున్నట్లు చూపించి అసలు కష్టాలను దాచేశారని, కాగితాలపై గొప్పలు చెప్పారని వ్యాఖ్యానించింది. దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో ఏపీకి భారీ కోత పడిందని కూడా పేర్కొంది. రెవెన్యూ గ్రాంట్లలోనూ నష్టమే జరుగుతోందని, కేవలం అప్పుల కోసమే జీఎస్డీపీకి రెక్కలు తొడిగారని కూడా వెల్లడించింది.

కొంతకాలంగా ఏపీ ఆర్ధిక పరిస్థితి, దొంగ లెక్కల గురించి ఆర్థిక నిపుణులు, అనుభవజ్ఞులైన జర్నలిస్టులు చెబుతున్నది కూడా అదే. అయితే, అప్పుడు పచ్చ మీడియా చంద్రబాబును వెనకేసుకొచ్చింది. ఇప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఇలాంటి కథనాలు రాసిందని అంటున్నారు. అందుకే ఇందులో వాస్తవమున్నా నిజాయితీ మాత్రం కనిపించదు. వైఎస్‌ జగన్ హయాంలో అప్పులే ఆలంబన అని, ఇప్పుడేమో అప్పులతోపాటు ఇమేజీ కోసం ఆరాటం అని ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది. అంతే తప్ప జగన్ టైమ్‌లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభంతో వచ్చిన సమస్యలను రాయడానికి వీరికి చేయి రాలేదు. పైగా జగన్ హయాంలో  రాష్ట్రం బ్రాండ్ పాతాళానికి చేరిందంటూ తప్పుడు వ్యాఖ్యలతో కథనాన్ని ఆరంభించడమే వీరి కుళ్లుకు దర్పణంగా కనిపిస్తుంది. అప్పుడేమో సంక్షేమమేనట, బటన్ నొక్కడమేనట. ఇప్పుడేమో పరిస్థితి మారిందట. సంక్షేమం, అభివృద్ది కావాలట. పెట్టబడులు రావాలట.

ఆ రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారని, అందుకు సుమారు రూ.లక్షన్నర కోట్లు ప్రతి ఏటా ఖర్చు చేయాల్సి ఉంటుందని జగన్ చెబితే ఈ మీడియా అంగీకరించిందా?. లేకపోగా జగన్‌పై చంద్రబాబు శరాలు సంధించారని గొప్పగా రాసింది. జగన్ టైమ్‌లో పోర్టులు, మెడికల్ కాలేజీలు కడితే, అవేవీ ఎల్లో మీడియా కళ్లకు కనిపించలేదు. పోనీ చంద్రబాబు టైమ్‌లో వచ్చిన కొత్త పరిశ్రమలు కనిపించాయా అంటే లేదు. కంపెనీలకు 99 పైసలకే  ఎకరాలకు ఎకరాలు ధారాదత్తం చేస్తుంటే, రాష్ట్ర ప్రజల సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతుంటే వీరికి తప్పు అనిపించదు. కానీ, జగన్ అలాంటి పనులు చేయకపోయినా ఆయనపై పడి ఏడుస్తుంటుంది. ఈ మీడియా ఇచ్చిన కథనంలో వృద్దిరేటుపై చంద్రబాబు చెబుతున్న విషయాలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయని తెలిపింది. ఈ లెక్కల వల్ల రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లలో గండి పడుతోందని తెలిపింది. చంద్రబాబేమో తనంత ఘనాపాటి లేడని అనిపించుకోవాలని అతిశయోక్తులతో కూడిన అంకెలతో గారడి చేస్తుంటే, ఆర్థిక శాఖకు చెందినవారో, లేక మంత్రి ఎవరో ఈ విషయాలు చెప్పి కథనం రాయించినట్లు  అనిపిస్తుంది.

ఈ తప్పుడు లెక్కల వల్ల ఏపీకి కేవలం రూ.7500 కోట్ల మేర మాత్రమే కేంద్రం గ్రాంట్ వచ్చిందని, అదే బీహారుకు రూ.17500 కోట్లు వచ్చిందని వివరించారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కూడా ఇలాగే నష్టపోతున్నదట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగిపోతోందన్న లెక్కలవల్లే  ఈ వాటా తగ్గుతోందట. అయితే ఏపీలో జీఎస్టీ వసూళ్లు తగ్గిన అంశాన్ని ఈ మీడియా కప్పిపుచ్చేసింది. జగన్ టైమ్‌లో జీఎస్డీపీ రూ.14 లక్షల కోట్ల ఉంటే,  దానిని ఏడాదికి రెండు లక్షల కోట్ల చొప్పున  పెంచేశారని, దీనికి తగినట్లుగానే తలసరి ఆదాయం అంచనాలు కూడా పెంచేశారని ఈ పత్రిక తెలిపింది. అప్పుల కోసం, బ్రాండ్ ఇమేజీ కోసం ఇలా చేస్తున్నారట. దేశంలో  జీఎస్డీపీ 8.7 శాతం ఉంటే, ఏపీలో మాత్రం అది 11.28 శాతంగా చూపించడాన్ని ఈ మీడియా తప్పుపట్టింది. దేశ సగటు కన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా వస్తాయని, ఏపీలో చాలా ఎక్కువగా చూపినందున తక్కువ నిధులు వస్తాయని ఈ మీడియా వాపోయింది. అలాగే జాతీయ తలసరి ఆదాయం కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని ప్రభుత్వం గొప్పలు పోయిందట. ఈ పరిస్థితిలో కేంద్రం నుంచి అధిక నిధులు, పన్నులలో ఎక్కువ వాటా ఎలా వస్తుందని అధికారులు అంటున్నారట.

చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ లెక్కల్లోని డొల్లతనం కూడా ఈ పత్రిక బహిర్గతం చేసింది. ఏపీకి పన్నేతర ఆదాయం రూ.19,119 కోట్లుగా అంచనా వేశారని, అవన్ని గాలి మేడలే అని చెబుతూ ఈ పద్దు కింద రూ.ఐదు వేల కోట్లు వస్తే గొప్ప అని స్పష్టం చేసింది. ఇప్పటికి వచ్చింది రూ.3671 కోట్లేనట. రాష్ట్ర పన్ను ఆదాయం కింద రూ.1.09 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే నవంబర్ నాటికి వచ్చింది రూ.68 వేల కోట్లేనని తేలింది. ఆదాయం పరిస్థితి ఇలా ఉండగా, ప్రభుత్వ ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. రెవెన్యూలోటు 163 శాతానికి చేరుకుంది. రూ.1.60 లక్షల కోట్లు వ్యయం చేస్తే అందులో కేవలం రూ.17 వేల కోట్లే మూలధన వ్యయంగా ఉంది. ఈ అంకెల విషయంలో ఎక్కడా జగన్ ప్రభుత్వం నాటి లెక్కలతో పోల్చకుండా ఈ ఎల్లో మీడియా జాగ్రత్తపడింది.

కేంద్రం నుంచి కూడా అప్పట్లో అధిక నిధులను జగన్ ప్రభుత్వం సాధించింది. ఉదాహరణకు రెవెన్యూ లోటు కిందే  సుమారు రూ.పది వేల కోట్లు పొందింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు రాబట్టుకోగలిగింది. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేసి, అదనపు నిధులు సాధించింది. పైగా ఆ రోజుల్లో జీఎస్టీ వసూళ్లలో కూడా దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉండేది. అయినా అప్పుడు బ్రాండ్ పాతాళంలో ఉందని తప్పుడు రాతలు రాసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు ఈ  దారుణ పరిస్థితికి ఎన్ని పాతాళాల లోతున కూటమి  ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందో మాత్రం చెప్పలేదు.

వ్యాపార  లావాదేవీలు, ప్రజల కొనుగోలు శక్తి మొదలైనవన్నీ జగన్ టైమ్‌లో మెరుగ్గా ఉన్న విషయాన్ని ఎల్లో మీడియా కప్పిపుచ్చే యత్నం చేసింది. కేవలం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగవేయడానికి వీలుగా గత కొన్నాళ్లుగా కథనాలు ఇస్తున్న ఈ పచ్చ మీడియా అందులో భాగంగానే తాజా కథనమూ ఇచ్చి ఉండవచ్చు. కానీ, ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధ్వంస పాలనను తనకు తెలియకుండానే ప్రజల ముందు ఉంచింది.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement