ఢిల్లీ: కాలుష్యంపై చర్చించకుడానే లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. నిన్న వీబీ జీ-రామ్-జీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇవాళ కూడా విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. వీబీ జీ-రామ్-జీ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ ఫొటోలతో విపక్షాల నిరసనకు దిగాయి. రాత్రంత సంవిధాన్ సదన్ ముందు తృణమూల్ ఎంపీలు నిరసనలు తెలిపారు.
తెల్లవారుజాము దాకా అక్కడే ఉండి ఎంపీలు నిరసనలు తెలిపారు. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవికా మిషన్–గ్రామీణ(జీ రామ్ జీ) బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. తొలుత లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో బిల్లు ప్రతులను చించేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మోదీ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని, గాం«దీజీ ఆశయాలు, ఆదర్శాలను నీరుగారుస్తోందని మండిపడ్డారు.పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఏమిటని నిలదీశారు. గాం«దీజీ వారసత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. జీ రామ్ జీ బిల్లుపై లోక్‌సభలో దాదాపు 8 గంటలపాటు చర్చ జరిగింది.
జీ రామ్ జీ బిల్లును కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లును ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. సమగ్ర పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. బిల్లులో సవరణలు సూచించడానికి తగినంత సమయం ఇవ్వాలని కోరారు. సుదీర్ఘ చర్చ తర్వాత మూజువాణి ఓటుతో అర్ధరాత్రి దాటాక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది.


