ఇదో లగ్జరీ లిటిగేషన్‌.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు | Supreme Court Interesting Comments On packed Drinking Water | Sakshi
Sakshi News home page

ఇదో లగ్జరీ లిటిగేషన్‌.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

Dec 19 2025 7:09 AM | Updated on Dec 19 2025 7:09 AM

Supreme Court Interesting Comments On packed Drinking Water

న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌కు అంతర్జాతీయ ప్రమాణాలుండేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్‌ను ‘లగ్జరీ లిటిగేషన్‌’ అంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశంలో ఇప్పటికీ చాలా మంది ప్రజలకు కనీసం మంచినీరు కూడా దొరకని పరిస్థితులున్నాయని పేర్కొంది.

‘ఈ దేశంలో తాగు నీరు ఎక్కడుంది, మేడమ్‌? ప్రజలకు తాగు నీరే అందుబాటులో లేదు. నీటి నాణ్యత విషయం తర్వాత మాట్లాడుకుందాం’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొనగా, ఇవన్నీ ఖరీదైన పిటిషన్లంటూ ధర్మాసనంలో ఉన్న జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చి వ్యాఖ్యానించారు. మన దేశంలో విక్రయించే ప్యాకేజ్డ్‌ తాగు నీటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వంటి సంస్థలు నిర్ణయించిన అంతర్జాతీయ ప్రమాణాలుండేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సారంగ్‌ వామన్‌ యద్వాద్కర్‌ వేసిన పిటిషన్‌పై సీనియర్‌ లాయర్‌ అనితా షెనాయ్‌తో ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. అసలు, మీ ఇంట్లో మంచినీరు ఉందా అని ప్రశ్నించింది.

దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను తాము మరువలేమని తెలిపింది. పట్టణ ప్రాంత పరిస్థితులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్న ధర్మాసనం.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బావుల్లో నీటిపైనే ఆధారపడుతున్నారని, వారెలాంటి అనారోగ్యాలకు గురికావడం లేదని తెలిపింది. అమెరికా, జపాన్, ఈయూ తరహా మార్గదర్శకాలను మనం అమలు చేయగలమని భావిస్తున్నారా అంటూ నిలదీసింది. పేదల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇలాంటివన్నీ కేవలం పట్టణవాసులు, ధనికుల భయాందోళనల నుంచి వస్తున్న పిటిషన్లు మాత్రమేనని పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement