1,500 మంది జనాభా.. 27 వేల జనన ధ్రువపత్రాలు
మహారాష్ట్రలో భారీ కుంభకోణం
అది ఒక చిన్న గ్రామం.. జనాభా కేవలం 1500. కానీ, మూడు నెలలుగా అక్కడ పుట్టిన పిల్లల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 27,397..! వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో వెలుగుచూసిన ఒక భారీ కుంభకోణం. ఈ లెక్కలు చూసి సాక్షాత్తూ అధికారులే కంగుతిన్నారు. ఈ ’జనన
ధ్రువపత్రాల’ మాయాజాలం వెనుక ఉన్న అసలు కథేంటి?
సర్వేలో సైబర్ నేరం బట్టబయలు
యావత్మాల్ జిల్లా ఆర్నీ తహసీల్‌లోని షెందురుసాని గ్రామ పంచాయతీలో.. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలల మధ్య జనన, మరణ ధ్రువపత్రాల తనిఖీ కోసం అధికారులు ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అప్పుడే అసలు బండారం బయటపడింది. జనాభా 1500 దాటని గ్రామంలో, వేల సంఖ్యలో పుట్టినట్లు నమోదైన గణాంకాలను చూసి ఉన్నతాధికారులకు దిమ్మ తిరిగింది. ఇది కేవలం పొరపాటు కాదు.. ఒక వ్యవస్థీకృత సైబర్ నేరమని అర్థమైంది.
కుంభకోణంలోని ప్రధానాంశాలు
అన్నీ బయటి పేర్లే: ఈ 27,397 మందిలో 99 శాతం పేర్లు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవని బీజేపీ నేత కిరిత్ సోమయ్య వెల్లడించారు.
ఐడీ దురి్వనియోగం: గ్రామం పరిధితో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లతో జనన ధ్రువపత్రాలు జారీ అయ్యాయి.
భారీ నెట్‌వర్క్: ప్రభుత్వ పథకాల లబ్ధి కోసమో లేదా నకిలీ గుర్తింపు కార్డుల సృష్టి కోసమో ఈ భారీ స్కామ్ జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
దర్యాప్తు ముమ్మరం
ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఒక చిన్న గ్రామం కేంద్రంగా జరిగిన ఈ భారీ సైబర్ నేరం వెనుక ఎవరున్నారు? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్ర కోణం ఏంటి? అనే దిశగా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా పెరుగుతుందో, దాన్ని అడ్డు పెట్టుకుని జరిగే మోసాలు కూడా అంతే విస్మయం కలిగిస్తున్నాయి. షెందురుసాని గ్రామంలో వెలుగు చూసిన ఈ ’జననాల పెంపు’ కుంభకోణం ఇప్పుడు మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది.
ముంబై నుంచి నియంత్రణ
ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. గ్రామ పంచాయతీకి చెందిన సీఆర్‌ఎస్ (సివిల్ రిజి్రస్టేషన్ సిస్టమ్) లాగిన్ ఐడీని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఐడీని ముంబై నుంచి నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. గ్రామానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లతో ఈ ధ్రువ పత్రాలను సృష్టించారు.
రంగంలోకి ఉన్నతాధికారులు
ఈ ఘటనపై జిల్లా పరిషత్ సీఈవో మందార్ పట్కీ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా ఆరోగ్య అధికారి ఫిర్యాదుతో యావత్మాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మాట్లాడినట్లు, ఈ నకిలీ రిజిస్ట్రేషన్లన్నింటినీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు బీజేపీ నేత కిరిత్ సోమయ్య తెలిపారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


