చైనాలో అత్యంత గౌరవనీయమైన , ప్రసిద్ధ కళాకారుడు ఫ్యాన్ జెంగ్. 87 ఏళ్ల వయసులో తాను ఒక బిడ్డకు తండ్రి అయినట్లు ప్రకటించాడు. తన భార్య 37 ఏళ్ల జు మెంగ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడించారు. అంతేకాదు ఏకైక జీవసంబంధమైన కొడుకు ఇతడే అంటూ తన ఇతర పిల్లలతో సంబంధాలను తెంచుకుని, మరోసారి కుటుంబ వివాదాలను సోషల్ మీడియాలో తెరపైకి తీసుకురావడం విశేషంగా నిలిచింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం తనకు కొడుకు పుట్టినట్లు ప్రకటించడం మాత్రమే కాదు ఇతర పిల్లలతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు వెల్లడించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. తన బిడ్డను "ఏకైక సంతానం"గా అభివర్ణించాడు. కొత్త ఇంట్లోకి మారాం, భార్య, కొడుకుతో చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. అలాగే వయసు పెరిగిన నేపథ్యంలో తన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పూర్తిగా జుకు అప్పగిస్తున్నట్లు చెప్పాడు. రూ 2400 కోట్ల వివాదం, లేటు వయసులోఫ్యాన్ బిడ్డను కనడం, ఇంటితో సంబంధాలను తెంచుకోవడం, సుదీర్ఘ కళా జీవితాన్ని మసకబారుస్తుందంటున్నారు నిపుణులు.

ఫ్యాన్ కుటుంబంలో వివాదాలు
గత కొన్నేళ్లుగా కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఫ్యాన్ కూతురు జియావోహుయ్, సవతితల్లి జుపై సంచలన ఆరోపణలు చేసింది. తమను, తండ్రిని కలవనివ్వడం లేదని, తన తండ్రి 2 బిలియన్ యువాన్లు (రూ. 2,400 కోట్ల) విలువైన కళాఖండాలను జు రహస్యంగా అమ్ముకుందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఫ్యాన్ జెంగ్ సంస్థ ఖండించింది.
ఎవరీ ఫ్యాన్ జెంగ్
ఫ్యాన్ సాంప్రదాయ చైనీస్ పెయింటింగ్‌లు, కాలిగ్రఫీ నైపుణ్యంతో చైనాలో బాగా పాపులర్. జియాంగ్సు ప్రావిన్స్‌లో ఫ్యాన్ జెంగ్ జన్మించాడు. బీజింగ్ సెంట్రల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ప్రఖ్యాత కళాకారులు లి కెరాన్, లి కుచన్ వద్ద శిక్షణ పొందాడు.అద్భుతమైన కళాకృతులతో గొప్పకళాకారుడిగా, చైనాలోని ప్రముఖ కళాకారుడిగా తెచ్చుకున్నాడు. అనేక దశాబ్దాలుగా అంతర్జాతీయంగా ప్రదర్శించబడుతున్నాయి. అయితే గత ఏడాది ఏప్రిల్‌లో, తన కంటే 50 ఏళ్ల చిన్నదైన జు మెంగ్‌ను వివాహం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఆయన నాలుగో భార్య జుతో కలిసి జీవిస్తున్నాడు.
చైనీస్ మీడియా నివేదికల ప్రకారం, అతని రచనలు 2008 - 2024 మధ్య వేలంలో 4 బిలియన్ యువాన్లకు పైగా ఆర్జించాయి. పలు చిత్రాలు 10 మిలియన్ యువాన్లకు పైగా అమ్ముడయ్యాయి. వీటిలో 1991లో 2011లో బీజింగ్ వేలంలో 18.4 మిలియన్ యువాన్లకు అమ్ముడుపోవడం విశేషం. అతను సృష్టించే కాలిగ్రఫీ విలువ 0.11 చదరపు మీటరుకు 200,000 యువాన్ల ధర ఉంటుందట.


