'ప్రశాంతతకు తాళం మన మనసులోనే'..! | Meditation For Global Peace, Gurudev Sri Sri Ravi Shankar's Message At The UN Headquarters In Geneva, More Details | Sakshi
Sakshi News home page

'ప్రశాంతతకు తాళం మన మనసులోనే'..!: గురుదేవ్‌ రవిశంకర్‌

Dec 18 2025 4:01 PM | Updated on Dec 18 2025 4:56 PM

 World Meditates with Gurudev Sri Sri Ravi Shankar at United Nations

ఒకప్పుడు సామాన్యులకు నిషిద్ధంగా భావించిన  ధ్యానం నేడు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందింది. ప్రపంచంలో అశాంతి మరింత పెరుగుతున్న ఈ కాలంలో ధ్యానసాధనను శాశ్వతంగా మన జీవితాలలో భాగంగా స్వీకరించాల్సిన అవసరాన్ని ప్రపంచం గుర్తించాలని, విశ్వవిఖ్యాత ఆధ్యాత్మిక గురువు మానవతావాది గురుదేవ్ విశంకర్ బుధవారం జెనీవాలోని ఐక్యరాజ్యసమితి భవనం నుంచి పిలుపునిచ్చారు. 

రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. గతేడాది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మందికి పైగా ప్రజలు ఒకేసారి ధ్యానం చేసి, ప్రపంచవ్యాప్తంగా చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన విషయం విదితమే. వ్యక్తిగత శ్రేయస్సుకే కాకుండా, అలసట, ఒత్తిడి, సంఘర్షణలు, అనిశ్చితి, భావోద్వేగ వేదనలతో పోరాడుతున్న సమాజాలకు ధ్యానం ఎంత అవసరమో గురుదేవ్ తన ప్రసంగంలో వివరించారు.

ప్రపంచ శాంతి కోసం ధ్యానం
ఈ సందర్భంగా భారతదేశ శాశ్వత ప్రతినిధి కార్యాలయం (పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా), ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘ప్రపంచ శాంతి కోసం ప్రపంచం ధ్యానం చేస్తోంది’ అనే అంశంపై గురుదేవ్ ప్రసంగించారు. వయస్సు, ప్రాంతం అనే భేదం లేకుండా ఆందోళన, బర్నౌట్, ఒంటరితనం పెరుగుతున్న ఈ సమయంలో, సమస్యలకు బాహ్య పరిష్కారాలు కాకుండా, మానవ మనసును స్థిరపరిచి శాశ్వత పరిష్కారాన్ని అందించే దిశగా కూడా చూడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

“ఈ రోజుల్లో ధ్యానం ప్రపంచానికి ఒక విలాసం కాదు,” అని గురుదేవ్ అన్నారు. “మన జనాభాలో మూడో వంతు మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. సగం మంది మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనల్ని మనతోనే కలిపే, మనలో దాగి ఉన్న ఒత్తిడిని తొలగించే ఒక సాధనం అవసరం. అప్పుడే ధ్యానానికి ప్రాముఖ్యత వస్తుంది.”

ధ్యానం - మానసిక పరిపూర్ణత
ధ్యాన సందర్భంలో మానసిక పరిపూర్ణత (మైండ్ ఫుల్ నెస్) గురించి వివరిస్తూ గురుదేవ్ ఇలా అన్నారు: “మైండ్ ఫుల్ నెస్ మీ ఇంటికి వెళ్లే దారి లాంటిది, ధ్యానం మీ ఇల్లు. ధ్యానం మనల్ని మన అంతర్లీన లోకంలోకి తీసుకెళ్లి అవసరమైన ప్రశాంతతను అందిస్తుంది. ఇది చేయడం  కష్టమేమీ కాదు. స్థూలంగా చెప్పాలంటే ధ్యానం అనేది మనసు అనే కంప్యూటర్లో అనవసరంగా నిల్వ చేసిన ఫైళ్లన్నింటినీ ‘డిలీట్’ బటన్ నొక్కి ఖాళీ చేయటమే.”

శక్తి, సమన్వయం: ధ్యానం
“మనమంతా శక్తే,” అని గురుదేవ్ పేర్కొన్నారు. “ఈ శక్తి సమన్వయంతో ఉందా? మన పరిసరాలలో ఐక్యతను సృష్టిస్తున్నదా? అనే ప్రశ్నలకు ధ్యానంలోనే సమాధానం ఉంది. ధ్యానం మన చుట్టూ అవసరమైన సామరస్యాన్ని సృష్టిస్తుంది. మన వైబ్రేషన్లను శుద్ధి చేస్తుంది.”

చరిత్ర సృష్టించిన ప్రపంచ ధ్యానం
గత ఏడాది డిసెంబర్ 21న ‘వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్’ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మందికి పైగా ప్రజలు ఒకచోట చేరి ధ్యానం చేశారు. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద ధ్యాన సమూహంగా నిలిచి, ఆరు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది.

ఈ కార్యక్రమం ప్రత్యేకత కేవలం సంఖ్యల్లోనే కాకుండా, పాల్గొన్న వారి వైవిధ్యంలోనూ కనిపించింది — నివాస ప్రాంతాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు, సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలు, సామాజిక కేంద్రాలు ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల అన్ని వర్గాల ప్రజలూ ఇందులో భాగమయ్యారు.

భారత శాశ్వత ప్రతినిధి అభిప్రాయం
జెనీవాలోని ఐక్యరాజ్యసమితి, సంబంధిత అంతర్జాతీయ సంస్థల భారతదేశ శాశ్వత ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ, “గతేడాది అంతర్జాతీయ సదస్సు నాటి గురుదేవుల జెనీవా సందర్శనను మేము ఆత్మీయంగా గుర్తుచేసుకుంటున్నాము. లోతైన సంఘర్షణలు, అవిశ్వాసంతో నిండిన ప్రపంచంలో, ధ్యానం కేవలం వ్యక్తిగత స్వీయాభివృద్ధి సాధన మాత్రమే కాదు అది సంక్లిష్టమైన ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, విశ్వాసాన్ని పరస్పర సుహృద్భావాన్ని పెంపొందించడానికి ఒక శక్తివంతమైన సాధనం,” అని తెలిపారు.

బాహ్య ఆడంబరాల నుంచి అంతరంగ కేంద్రానికి ప్రయాణం 
ఆధునిక కాలంలో పశ్చిమ దేశాలలో ధ్యానం ఒకవైపు కొత్త ఫ్యాషన్‌గా, విభిన్నంగా ప్రాచుర్యం పొందగా, మరోవైపు అది పాతకాలపు ఆధ్యాత్మిక సాధనంగా, ఈ కాలానికి సరిపడదని కూడా భావించారు. 1980ల ప్రారంభంలో, మనిషి అంతరంగాన్ని అర్థం చేసుకోగలిగే ఈ శాస్త్రానికి పెద్దగా ప్రాధాన్యత లేని సమయంలోనే, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ప్రపంచానికి ధ్యానాన్ని మరలా పరిచయం చేసే బృహత్తర ప్రయాణాన్ని ప్రారంభించారు.

విద్య, సంఘర్షణల పరిష్కారం, రైతు సంక్షేమం, జైలు ఖైదీల పునరావాసం, యువ నాయకత్వం, కార్పొరేట్ రంగంలో ఒత్తిడి నిర్వహణ, సమాజ పునర్నిర్మాణం వంటి అనేక రంగాల్లో ధ్యానం ఆయన సేవలకు కేంద్రబిందువుగా మారి, 182కు పైగా దేశాలలో కోట్లాది మందిని చేరుకుంది.

బుధవారంనాటి తన ప్రసంగంలో గురుదేవ్, ఐక్యరాజ్యసమితి ప్రధాన సభ తీర్మానాన్ని ఆమోదించిన 192 దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్గత సాధన ఇంత విస్తృతమైన సాంస్కృతిక, శాస్త్రీయ, సంస్థాగత గుర్తింపును పొందడం అరుదైన విషయం. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది.

ముందుకు సాగుతున్న ప్రపంచ ఉద్యమం
ఈ విశ్వవ్యాప్త స్ఫూర్తిని కొనసాగిస్తూ.. గురుదేవ్ డిసెంబర్ 19న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నుంచి కీలక ప్రసంగం చేయనున్నారు. భిన్న ధృవాలుగా విడిపోతూ, విభిన్న అభిప్రాయాల సంఘర్షణకు లోనవుతున్న నేటి ప్రపంచంలో మానసిక ధైర్యం, పరస్పర చర్చలను, శాంతిని పెంపొందించడంలో ధ్యానం మరింత కీలకపాత్ర పోషించనుంది

ఈ ఏడాది డిసెంబర్ 21న, న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని ప్రతిష్టాత్మక ‘ఒక్యులస్’ నుంచి రాత్రి 8.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) గురుదేవ్ నేతృత్వంలో కోట్లాది మంది ధ్యానం చేయనున్నారు.

నిరంతర ప్రయాణంగా సాగే ఈ ప్రపంచంలో, ఒక క్షణకాలపు నిశ్శబ్దం, సరిహద్దులను దాటి సామరస్యాన్ని వ్యాపింపజేసే ఒక శ్వాస.. అదే ధ్యానం. వేగంగా మారిపోతున్న అనిశ్చితమైన కాలంలో సైతం, మన ప్రశాంతతకు తాళం మన మనసులోనే ఉందని గుర్తుచేసే సున్నితమైన సందేశంగా ఈ కార్యక్రమం నిలవనుంది.

(చదవండి: కొద్ది సేపు బ్రేక్‌ ఇచ్చే కిక్‌ వేరేలెవెల్‌..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement