కేరళ రాష్ట్రం పేదరికాన్ని జయించిందట. రాష్ట్రంలో కడు పేదలు అసలు లేరని ఆ రాష్ట్రం గొప్పగా ప్రకటించుంది. అంటే.. ఇక్కడ అందరూ ధనవంతులనేనా అర్థం? కాదు. పేదరికం అంటే డబ్బుల్లేకపోవడం మాత్రమే కాదు. కడు పేదరికం లేదా దుర్భర దారిద్ర్యం అనేదానికి నిర్వచనం వేరు.
ఐక్యరాజ్య సమితి ఈ విషయంపై ఏం చెబుతుందంటే... మనిషి బతికేందుకు అత్యవసరమైన కనీస అవసరాలు తీరకపోవడమే కడు పేదరికం అని!. తినేందుకు తిండి, తాగేందుకు సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఉండేందుకు ఒక గూడు, విద్య వంటివి ప్రాథమిక మానవ అవసరాలని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 కోట్ల మంది కడు పేదరికంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులు, యుద్ధం, ఆర్థిక అస్థిరతల వంటివి పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 తరువాత అంతర్జాతీయంగా పేదరికం మళ్లీ పెరిగినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సరే.. మరి ఎంత ఆదాయం ఉంటే పేదరికాన్ని దాటినట్టు?. ప్రపంచబ్యాంకు నిర్వచనం ప్రకారం... రోజుకు 1.90 డాలర్ల సంపాదన ఉన్న వారు అంతర్జాతీయ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు. ఈ లెక్క 2016 నాటిది. 2024 నాటి లెక్కల ప్రకారం రోజుకు 2.66 డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారు కటిక దరిద్రంలో ఉన్నట్టు. ఈ మొత్తం పర్చేసింగ్ పవర్ పారిటీకి తగ్గట్టుగా అంటే వివిధ దేశాల్లోని కాస్ట్ ఆఫ్ లివింగ్‌ను పరిగణలోకి తీసుకుని లెక్కించింది. కనీస అవసరాలను కూడా అందుకోలేనంత పేదలు ఎంతమంది ఉన్నారో గుర్తించేందుకు ఈ లెక్క ఉపయోగపడుతుందని అంచనా.
ప్రాముఖ్యత ఏమిటి?
నిజజీవిత ఉదాహరణ ఒకదాన్ని పరిశీలిద్దాం... ఓ పల్లెలో అత్యధికులు రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదిస్తున్నారని అనుకుందాం. అప్పుడు ఈ పల్లెలోని కుటుంబాలు పోషకాహారం పొందలేరు. ఫలితంగా పోషకాహాల లోపాలు వస్తాయి. స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం అందుబాటులో లేకపోతే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులతో కలిసి పనికెళ్లే అవకాశం ఉంటుంది. ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుంది.
ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఐక్యరాజ్య సమితి పేదరికం తొలగింపును సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటిగా నిర్ధారించింది. ఆ దిశగా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. పేదరిక నిర్మూలన అనేది కేవలం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతోనే జరిగిపోదు. వీలైనంత ఎక్కువమంది పేదలకు పని కల్పించడం పేదరిక నిర్మూలనకు చాలా కీలకం. అయితే పని చేసేందుకు అవసరమైన పరిస్థితులు కూడా బాగా ఉండేలా చూసుకోవాలి. 2019లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 63 కోట్ల మంది కార్మికులుంటే.. వీరిలో 20 శాతం మంది ఆదాయం తమ కనీస అవసరాలను తీర్చుకునేందుకూ ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో పేదరిక నిర్మూలన విషయంలో మానవ, కార్మిక హక్కుల పరిరక్షణ కూడా ముఖ్యమవుతుంది.
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా.


