నేటి నుంచి డిసెంబర్ 29 వరకు హైదరాబాద్ బుక్‌ఫెయిర్
38వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్ డిసెంబర్ 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు ఇందిరా పార్కు వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియం (కళాభారతి)లో జరగనుంది. రోజూ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9వరకు ప్రవేశవేళలు. విద్యార్థులకు ఉచిత ప్రవేశం. ఈసారి మొత్తం 365 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. దాదాపు 12 లక్షల మంది సందర్శిస్తారని అంచనా. పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చలు చోటు చేసుకుంటాయి.
‘పుస్తకం చదివితే వేయి జీవితాలు జీవించవచ్చు. చదవకుంటే ఒక్కటే’...అన్నాడో మహానుభావుడు. పుస్తకం చదవడమంటే మనకోమెదడు ఉందని గుర్తు చేసుకోవడం. పుస్తకం చదవడమంటే మనకో కుతూహలం ఉందని తెలుసుకోవడం. ఫో¯Œ ... మనకు అక్కర్లేని వినోదాలను ఇస్తోంది. పుస్తకం... కచ్చితమైన
దిశను సూచిస్తుంది. దిశాబద్ధులై ఉండేందుకు బుక్‌ఫెయిర్ బాట పట్టండి.
‘పుస్తకాలు అపరిచిత మిత్రులకు స్వాగత ద్వారాలు’.
మనిషికి ఏం కావాలి? తనను తాను వ్యక్తపరుచుకోవడం కావాలి. అందుకే మాట్లాడాడు. పాడాడు. ఆడాడు. బొమ్మలు గీశాడు. రాశాడు. వాటి ద్వారా తనేమిటో చె΄్పాడు. ఇదే మనిషికి సాటి మనిషి ఎలా వ్యక్తమవుతాడో కూడా కావాలి. అతని జీవితం ఎలా ఉంది... ఆలోచనలు ఏమిటి... సమస్యలు ఏమిటి... వాటిని ఎలా ఎదుర్కొన్నాడు.... అందుకే ఆట, పాట, బొమ్మ, కథల్లో సాటి మనిషి గురించి తెలుసుకోవడానికి ఉబలాట పడ్డాడు.
ఈ ఇచ్చి పుచ్చుకోవడాలు సజీవంగా ఉన్నంత కాలం మనిషి సజీవంగా ఉన్నట్టే లెక్క. లేకుంటే పాకుడు నీళ్లతో సమానం. అందుకే పుస్తకాలు చదవాలి. తనను తాను తెలుసుకునేందుకు, ఇతరుల గురించి తెలుసుకునేందుకూ. ఈ విశాల సృష్టిలో మనుషులంతా ఒక్కలాంటి వాళ్లే... రకరకాల పద్ధతుల్లో జీవిస్తూ ఒకేరకమైన ఉద్వేగాలను అనుభవిస్తుంటారని తెలుసుకుని... అందరి నుంచి ఉమ్మడి శక్తిని పొంది వ్యక్తిగత జీవితాన్ని ఒడ్డున చేర్చుకునేందుకు పుస్తకాలు చదవాలి.
పెద్దబాలశిక్షతో మొదలు
పుస్తకం ప్రాథమిక కర్తవ్యం జ్ఞానాన్ని ఇవ్వడమే. అందుకే పుస్తకం విద్యాసాధనం అయ్యింది. అయితే విద్యతో మనిషి ఆగడు. కడుపు నిండిన మనిషి కళ కోసం చూసినట్టే విద్య నేర్చిన మనిషి వికాసం వైపు చూశాడు. వికాసానికి పుస్తకం దారి చూపింది. భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర... ఇవన్నీ పుస్తకంలో నిక్షిప్తమయ్యి తరం నుంచి తరానికి అందాయి. అయితే వికాసంతో కూడా మనిషి ఆగడు. వినోదం కావాలి, ఆహ్లాదం కావాలి, అనుభూతి కావాలి, ఉద్వేగం కావాలి, కల్పిత గాథలు... పుక్కిటి పురాణాలు కావాలి... ఫ్యాంటసీ ప్రపంచాలు కావాలి... అవన్నీ పుస్తకమే ఇచ్చింది. పుస్తకం ఇచ్చేలా చేసుకున్నాడు. పుస్తకాలను నిచ్చెనమెట్లుగా చేసుకుని మనిషి దినదిన ప్రవర్థమానమయ్యాడు. అయితే పుస్తకాన్ని వదిలిపెట్టిన, నిర్లక్ష్యం చేసిన జాతి చీకటిలో ప్రయాణిస్తుంది. కొనసాగింపు ముఖ్యం. అందుకే యూరోపియన్ దేశాలలో పుస్తకాన్ని వదిలిపెట్టడం అనేది అక్కడివాళ్లు కల్లో కూడా ఊహించరు. మనవాళ్లు పుస్తకం విలువ కనిపెట్టారు కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం పెద బాలశిక్ష అయినా ఉండాలని తలిచారు. నేడు మన ఇళ్లల్లో పెద బాలశిక్షకు బదులు ఫోన్లు చేరాయి.
జీవితాన్ని మార్చే పుస్తకాలు
పుస్తకాలు జీవితాలను మార్చేస్తాయి. ఒక్క పుస్తకం చదివి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నవాళ్లు, ఒక్క పుస్తకం చదివి జీవితాన్ని మార్చుకున్నవారు, ఒక్కపుస్తకం చదివి శాసనంగా మలుచుకున్నవారు ఉన్నారు. ‘విద్య లేని వాడు వింత పశువు’ అన్నారు పెద్దలు గానీ ‘పుస్తకం చదవని వాడే వింత పశువు’ అనుకోక తప్పదు. ‘తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఏం ఉంటుంది’ అన్నట్టుగా పుస్తకం చదవకపోతే వివేచన, వివేకం ఎలా జాగృతమవుతాయి? ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎలా తెలుస్తుంది? మనిషిగా పుట్టినందుకు మంచివైపు నిలబడాలన్న బాధ్యత ఎక్కడినుంచి వస్తుంది?
పుస్తకం చిరంజీవి
పుస్తకాన్ని చంపే మారణాయుధాలు ఎన్నో వచ్చాయి. సినిమాలు, టీవీలు, వీడియో కేసెట్లు, వీడియో గేమ్స్, ఓటీటీలు, రీల్సు... ఎన్నో. కాని పుస్తకం చిరంజీవిగానే ఉంది. పుస్తకం వేయి పుటలతో లక్ష కన్నులతో లోకాన్ని చూపుతుంది. సినిమా ఆ పని చేయదు. పుస్తకం ఒక గాథను వాస్తవ పరిథిలో చూపి కొంత ఊహకు వదిలిపెడుతుంది. అది వీడియో చేయదు. పుస్తకం ప్రశ్నను లేవనెత్తుతుంది. వెంటాడుతుంది.
ప్రశ్న లేని మనిషి, ప్రశ్నించని మనిషి శిథిలమయ్యి మానసిక సంపద కోల్పోతాడు. అందుకే ‘మనీప్లాంట్ సరే. పుస్తకం ఉంచుకోవడం కూడా సంపదతో సమానమే’ అని గ్రహించాలి. మనుషులకు పండగ ఉన్నట్టు పుస్తకాలకు కూడా పండగ ఉంటుంది. ప్రతి సంవత్సరం ‘హైదరాబాద్ బుక్‌ఫెయిర్’లో పుస్తకాలన్నీ కూడబలుక్కుని ఒకచోటకు చేరుతాయి. వాటిని చూడటానికి వెళ్లాలి. చేతుల్లోకి తీసుకోవాలి. వాటితో స్నేహం చేయాలి. ఇంటికి పిల్చుకోవాలి. పుస్తకాలు ఇంటికి వచ్చాక దీపాలుగా మారడం మీరే గమనిస్తారు. ఆ కాంతులు ఇంటిని వెలిగించడం చూస్తారు. ఆ కాంతుల్లో వర్థిల్లడం ఎంతటి భాగ్యమో తప్పక తెలుసుకుంటారు.
అందరికీ తల ఊపడం మానేలా చేస్తాయి
పుస్తకాలు ఎందుకు చదవాలి? నా చిన్నప్పుడు నన్నెవరన్నా ఈ ప్రశ్న అడిగి ఉంటే ఆశ్చర్యపోయి ఉండేవాడిని. ఎందుకంటే పుస్తకాలు చదవడం వల్లనే నాకు లోకం తెలిసింది. ప్రపంచపు పోకడ తెలిసింది. మానవజాతి గతం గురించీ, వర్తమానం గురించీ తెలిసింది. మానవుడి భవిష్యత్తు ఎలా ఉండాలన్న దాని మీద కవులూ, రచయితలూ, తత్త్వవేత్తలూ శాస్త్రవేత్తలూ ఎటువంటి కలలుగన్నారో తెలిసింది. నేను పుట్టి పెరిగిన మారుమూల కొండ కింద పల్లెలో ఆ రోజుల్లో నాకు దొరికిన ఆ కొద్దిపాటి పుస్తకాలు ఆ రోజు దొరకకపోయి ఉంటే నా జీవితం గురించి నాకు ఎప్పటికీ అర్థమయ్యే దారి దొరికి ఉండేది కాదు. ఇప్పుడు ఇన్ని మాధ్యమాలు మన అరచేతుల్లోకి అందుబాటుకొచ్చాక పుస్తకాలు ఎందుకు చదవాలి అన్న ప్రశ్న తలెత్తుతున్నదేమో! ఇన్ని మాధ్యమాలున్నా, పుస్తకాలు చదవకపోతే మనం ఎప్పటికీ పక్కవాడి అభి్రపాయాలకే తలూపుతూ బతుకుతుంటాం. కాబట్టి ఈ మాధ్యమాలన్నింటిలోనూ అత్యంత విశ్వసనీయమైన మాధ్యమం పుస్తకాలు మాత్రమే.
– వాడ్రేవు చినవీరభద్రుడు,
సుప్రసిద్ధ రచయిత
పుస్తకాలు అందరినీ మనవాళ్లను చేస్తాయి
పుస్తకాలు అనేక మానవ జీవిత అనుభవాల సారాన్ని నింపుకున్న పాత్రలు. అమూల్యమైన జ్ఞానాన్ని పొందడానికి మన కళ్లను తెరిపించే వెలుతురు కిరణాలు. బలహీనులకు బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చే టానిక్‌లు. ప్రపంచాన్నంతా మనకు పరిచయం చేస్తాయి. మన జీవితాలను అర్థం చేసుకోవడం ఎలాగో నేర్పుతాయి. పుస్తకాలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, దయ, జాలి, కరుణ, ప్రేమ, సహోదర భావనలను మన హృదయాల్లో నింపుతాయి. వాట్సప్, యూట్యూబ్‌ల వంటివి మనల్ని మనం పరాయివారిగా చేస్తే పుస్తకాలు అందరినీ మనవాళ్ళుగా చేసుకోవటం నేర్పుతాయి. పుస్తకాలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కాదు. అసలైన వివేకం. పుస్తక స్పర్శ కోసం, ప్రపంచాన్ని ఆలింగనం చేసుకోవడం కోసం పుస్తక ప్రదర్శనలకు వెళ్ళాలి. మనం స్వయంగా ఎంచుకుని స్వంతం చేసుకొన్న పుస్తక పఠన అనుభూతికి సాటివచ్చేది లేదు. పుస్తకం కోసం తహతహలాడటమంత అందమైన అనుభూతి మరొకటి లేదు.
– ఓల్గా, సుప్రసిద్ధ రచయిత్రి


