ప్రతిష్టాత్మక సాయుధ దళాల సంస్థ అయిన ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA) నుంచి పాసైన తొలి మహిళా అధికారిణిగా చరిత్ర సృష్టించింది 23 ఏళ్ల అమ్మాయి. ఆమె నియామకంతో 93 ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యింది. ఎన్నో ఏళ్లుగా చూస్తున్న నిరీక్షణకు ఆమె నియామకంతో తెరపడింది. 1932లో అకాడమీ స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు 67,000కు పైగా ఆఫీసర్ క్యాడెట్లు పాసయ్యారు. వారిలో ఒక్క మహిళ కూడా లేదు. ఇంతకీ ఎవరా అమ్మాయి. ఈ ఘనతను ఎలా సాధించిందంటే..
డెహ్రడూన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఎ) తొలి మహిళా ఆఫీసర్‌గా 23 సంవత్సరాల సాయి జాదవ్ చరిత్ర సృష్టించింది. 1932లో ప్రారంభమైన ఈ అకాడమీ నుంచి 67,000 మంది ఆఫీసర్ క్యాడెట్‌లు పాసవుట్ పరేడ్ చేశారు. అందులో ఒక్కరు కూడా మహిళ లేరు. సాయి ముత్తాత బ్రిటిష్ సైన్యంలో, తాత భారత సైన్యంలో పనిచేశారు. నాన్న సందీప్ జాదవ్ ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నారు. ఆ కుటుంబం నుంచి నాలుగో తరం సైనిక అధికారిగా ప్రయాణం మొదలుపెట్టింది సాయి జాదవ్. ఆరు నెలల కఠిన సైనిక శిక్షణ పూర్తి చేసుకొని ‘ఐఎంఎ’ నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళా సైనిక అధికారిగా చరిత్ర సృష్టించింది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సాయి కర్నాటకాలో బెల్గాంతో సహా అనేక రాష్ట్రాలలో చదువుకుంది. గ్రాడ్యుయేషన్ తరువాత సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) పరీక్ష రాసి తన ప్రతిభతో అన్ని దశల స్క్రీనింగ్‌లలోనూ అర్హత సాధించింది. ఇండియన్ మిలిటరీ అకాడమీలో అందరూ పురుషులే కావడంతో అందులో శిక్షణ పొందిన వారిని ‘జెంటిల్‌మెన్ క్యాడెట్స్’ అని పిలిచేవారు. ఇప్పుడది ‘ఆఫీసర్ క్యాడెట్స్’గా మారనుంది.
‘ఐఎంఎ’లో నిర్వహించిన వేడుకలో సైనిక ఉన్నతాధికారులు సాయి జాదవ్ యూనిఫామ్‌పై నక్షత్రాల బ్యాడ్జీని పిన్ చేశారు. టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్‌గా ర్యాంకింగ్‌ను కేటాయించారు. చారిత్రక ఘనత సాధించిన సాయి గురించి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు.
‘ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించి టెరిటోరియల్ ఆర్మీలో చేరిన తొలి మహిళగా సాయి గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా ఉంది’ అంటున్నారు ఆమె తల్లిదండ్రులు. జూన్ 2026లో డెహ్రాడూన్ ‘ఇండియన్ మిలిటరీ అకాడమీ’లో జరగనున్న పాసింగ్ ఔట్ పరేడ్‌ను పూర్తిగా మహిళలతో కూడిన తొలి ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనుంది. ఇది చారిత్రక మలుపు అని చెప్పుకోవచ్చు.


