భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పోలీసుశాఖలో కలకలం చెలరేగింది. ఒక సీనియర్ మహిళా అధికారిపై దొంగతనం ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ పోలీసు శాఖను కుదిపేసింది. పోలీస్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ కల్పనా రఘువంశీ చోరీకి పాల్పడటం ప్రధానాంశంగా నిలిచింది.
ఎన్‌డీటీవీ కథనం ప్రకారం డిప్యూటీ సూపరింటెండెంట్ కల్పనా రఘువంశీ తన స్నేహితురాలి ఇంటిలో నుంచి రూ. 2 లక్షల నగదు, మొబైల్ ఫోన్ దొంగిలించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ నేపధ్యంలో ఆమెపై కేసు నమోదయ్యింది. భోపాల్‌లోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసుశాఖలో జవాబుదారీతనంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు తన మొబైల్ ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచి స్నానానికి వెళ్లానని, ఇంతలో డిఎస్పీ కల్పనా రఘువంశీ తమ ఇంటిలోనికి ప్రవేశించి, తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచిన నగదు, మరొక సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లారని ఆరోపించారు.
నగదు, ఫోన్ కనిపించకపోవడంతో ఫిర్యాదుదారు సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేయగా, దానిలో డీఎస్పీ రఘువంశీ ఇంట్లోకి ప్రవేశించడం, బయటకు వెళ్లడం కనిపించింది. ఆ ఫుటేజీలో అధికారిణి ఆ ఇంటి ఆవరణ నుండి బయటకు వెళ్లేటప్పుడు కరెన్సీ నోట్ల కట్టను పట్టుకుని ఉన్నట్లు కూడా కనిపించిందని పోలీసుల వర్గాలు తెలిపాయి. ఈ ఫుటేజీని చూసిన వెంటనే ఆ మహిళ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సదరు అధికారిణిపై దొంగతనం కేసు నమోదు చేశారు. ఇంతలో నిందితురాలు పరారయ్యారు. పోలీసులు ఆమె ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ బిట్టు శర్మ మీడియాతో మాట్లాడుతూ నిందితురాలి ఇంటి నుంచి ఫిర్యాదుదారు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, మాయమైన రూ. రెండు లక్షల నగదు గురించి తెలియలేదన్నారు. నిందితురాలిపై పోలీసు ప్రధాన కార్యాలయం శాఖాపరమైన నోటీసు జారీ చేసిందని, క్రమశిక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు.
ఇది కూడా చదవండి: ప్రేయసి ఇంట ఉత్కంఠ.. ప్రియుడు హత్య.. యువతి, మామ ఆత్మహత్యాయత్నం


