హమీర్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. తన ప్రియురాలికి బలవంతపు వివాహం చేస్తున్నారని తెలుసుకున్న ప్రియుడు వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నాడు. అతనిని గమనించిన ఆ యువతి కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేసి, హత్య చేశారు. ఇంతలో మరో అనూహ్య ఘటన చోటుచేసుకోవడంతో అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో తన ప్రియురాలు మనీషా(18)కు బలవంతంగా పెళ్లి జరుగున్నదని తెలుసుకున్న ఆమె ప్రియుడు రవి(35) ఆమెను కలుసుకునేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. దీనిని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు అతనిని పట్టుకుని కట్టేసి, కర్రలతో దాడి చేశారు. వీరికి గ్రామస్తులు కూడా సహకరించారు. తీవ్రంగా గాయపడిన రవి దాహంతో నీరు అడిగినా వారు నిరాకరించారు. ఈ తరుణంలోనే రవి మృతిచెందాడు.
దీంతో హత్యారోపణలు ఎదురైన మనీషా మామ పింటూ(35) ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంతలో అక్కడున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే బాధితులు రవి, పింటూలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. రవి చనిపోయాడని అక్కడి వైద్యులు దృవీకరించారు. విషయం తెలుసుకున్న మనీషా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె, ఆమె మామ పింటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని మౌదాహాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు తెలిపారని ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది.
ఈ ఘటన దరిమిలా మనీషా అమ్మమ్మ మీడియాతో మాట్లాడుతూ తాను ఇక్కడికి వచ్చిన సమయంలోనే రవి ఇక్కడకు వచ్చాడని, తరువాత పింటూను కత్తితో పొడిచాడని తెలిపింది. గతంలో ఒకసారి రవితో మనీషా వెళ్లిపోయిందని, అయితే తాము బలవంతంగా మనీషాను తీసుకురావడంతో అతను తమ కుటుంబంపై ఆగ్రహంతో ఉన్నాడని ఆమె పేర్కొంది. ఇదే ఘటన గురించి మనీషా అత్త, పింటు భార్య మాట్లాడుతూ ఇంటిలోనికి వచ్చిన రవిని తన భర్త గట్టిగా పట్టుకోగా, అతను కత్తితో తన భర్తను పొడిచాడని పేర్కొంది.
ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. హమీర్‌పూర్‌లోని పోలీసు సూపరింటెండెంట్ దీక్షా శర్మ మాట్లాడుతూ పర్చ్ గ్రామంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగిందని, ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని, మరొకరు గాయపడ్డారని తెలిపారు. మనీషా అనే యువతి తనను తాను గాయపరచుకుని, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: మరో వివాదంలో ప్రశాంత్ కిశోర్.. రెండు చోట్ల ఓటు.. టీఎంసీ ఆఫీసే చిరునామా!


