పట్నా: ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ నేత, ‘జన్ సురాజ్’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) మరో వివాదంలో చిక్కుకున్నారు. బీహార్, బెంగాల్‌లలో ఓటరుగా నమోదు చేసుకోవడమే కాకుండా తన చిరునామాగా టీఎంసీ కార్యాలయాన్ని చూపారు.
‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తెలిపిన వివరాల ప్రకారం జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో ఓటరుగా నమోదు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అతని పేరు 121 కలిఘాట్ రోడ్ చిరునామాతో ఓటరు జాబితాలో కనిపిస్తున్నది. ఇది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గం భబానీపూర్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యాలయం. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్.. టీఎంసీకి రాజకీయ సలహాదారుగా పనిచేశారు. బి రాణిశంకరి లేన్‌లోని సెయింట్ హెలెన్ స్కూల్‌లో అతని పోలింగ్ బూత్‌లో ఉంది.
బీహార్‌లో ససారాం పార్లమెంటరీ సీటు పరిధిలోకి వచ్చే కార్గహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా ప్రశాంత్ కిశోర్ తన పేరు నమోదు చేసుకున్నారు. రోహ్తాస్ జిల్లాలోని కోనార్ గ్రామంలో గల మధ్య విద్యాలయంలో అతని పోలింగ్ బూత్ ఉంది. ఇక్కడ ప్రశాంత్ కిశోర్ తండ్రి ఇల్లు ఉంది. కాగా ఈ విషయమై ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వివరణ కోరగా, దానికి ప్రశాంత్ కిశోర్ సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే బెంగాల్ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిశోర్.. బీహార్‌లో ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారని, అలాగే బెంగాల్‌లోని అతని ఓటరు కార్డును రద్దు చేయాలని దరఖాస్తు చేసుకున్నాని ‘పీకే’ బృందంలోని సభ్యుడొకరు తెలిపారు.
రెండు చోట్ల ఓటరు కావచ్చా?
ప్రజాప్రాతినిధ్య చట్టం- 1950లోని సెక్షన్ 17 ప్రకారం, ఏ వ్యక్తి అయినా ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలలో ఓటరుగా నమోదు చేసుకోకూడదు. అలాగే సెక్షన్ 18 ప్రకారం ఒకే నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేరు నమోదు చేసుకోకూడదు. ఎవరైనా తమ నివాసాన్ని మార్చుకున్నప్పుడు వారు ఫారమ్ 8లో వారి వివరాలను అప్‌డేట్ చేయాలి. ఇటువంటి సమస్యను పరిష్కరించేందుకే ఎలక్షన్ కమిషన్ ఇటీవల బీహార్‌తో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను చేపట్టింది. ఫలితంగా దాదాపు 68.66 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు.
ఇది కూడా చదవండి: Delhi: నేడు కృత్రిమ వర్షం.. కురిపిస్తారిలా.. ప్రయోజనమిదే..


