న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెను సమస్యగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమంగా వర్షాలను కురిపించేందుకు సిద్ధమయ్యింది. శీతాకాలంలో క్షీణిస్తున్న గాలి నాణ్యతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి అనంతరం పొగ, దుమ్ము, పొగమంచు కలగలిసి ఢిల్లీని గ్యాస్ చాంబర్ మాదిరిగా మార్చాయి. దీనికి క్లౌడ్ సీడింగ్ (కృత్రిమ వర్షాలు) పరిష్కారం చూపనుంది.
వాతావరణం అనుకూలిస్తే..
వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఢిల్లీ ప్రభుత్వం నేడు (మంగళవారం)తొలి క్లౌడ్ సీడింగ్ ట్రయల్‌ను నిర్వహించనుందని సంబంధిత అధికారి తెలిపారు. ఈ పరీక్షను నిర్వహించే ముందు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మీడియా సంస్థ పీటిఐకి తెలిపారు. ఈ ప్రయోగానికి ఉపకరించే విమానం కాన్పూర్ నుండి ఢిల్లీకి చేరుకుంటుందని, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే క్లౌడ్ సీడింగ్ ట్రయల్ నిర్వహిస్తామన్నారు. క్లౌడ్ సీడింగ్ ప్రయోగానికి సన్నాహాలు ఇప్పుటికే పూర్తయ్యాయి.
రూ.3.21 కోట్ల వ్యయం
ప్రభుత్వం ఇటీవల బురారి మీదుగా ఒక టెస్ట్ ఫ్లైట్ నిర్వహించిందని, టెస్ట్ రన్ సమయంలో కృత్రిమ వర్షపాతాన్ని ప్రేరేపించేందుకు ఉపయోగించే చిన్న పరిమాణంలో సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ సమ్మేళనాలను విమానం నుండి విడుదల చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. వాయువ్య ఢిల్లీలో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఐఐటీ, కాన్పూర్‌తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)కుదుర్చుకుంది. దీనికి ముందు ఢిల్లీ క్యాబినెట్ మే 7న రూ.3.21 కోట్ల వ్యయంతో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించాలనే ప్రతిపాదనను ఆమోదించింది.
క్లౌడ్ సీడింగ్ అంటే..
క్లౌడ్ సీడింగ్(కృత్రిమ వర్షం) అంటే మేఘాలలో రసాయనాలను విడుదల చేసి, వర్షం కురిసేలా చేసే విధానం . ఇందుకోసం సాధారణంగా సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి రసాయనాలు వాడుతారు. మేఘాలు తగినంతగా ఉన్న సమయంలో ఈ రసాయనాలను వాటిలోకి చిమ్మి, నీటి బిందువులు ఏర్పడేలా చేస్తారు. దాంతో మేఘాలు వర్షం కురిపిస్తాయి. ఈ ఆపరేషన్ కోసం సెస్నా అనే చిన్న విమానాన్ని ఎంచుకున్నారు. ఇది శాస్త్రీయ ప్రయోగాలకు, తక్కువ ఎత్తులో ఎగరడానికి, కచ్చితమైన నియంత్రణ సామర్థ్యాలను కలిగివుంటుంది. ఈ విమానాన్ని ప్రత్యేకంగా క్లౌడ్ సీడింగ్‌కు ఉపయోగపడే విధంగా మార్పులు చేశారు.
ఉపయోగాలివే..
కృత్రిమ వర్షం కారణంగా గాలిలే తేలియాడే కాలుష్య కణాలు కిందికి చేరతాయి. ఫలితంగా గాలి శుభ్రపడి, ఆక్సిజన్ స్థాయి మెరుగుపడుతుంది. ఇది తాత్కాలిక పరిష్కారంగా కనిపించినప్పటికీ, కాలుష్యం అధికంగా ఉన్న సమయంలో ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ ప్రయోగానికి వాతావరణం అనుకూలించడం అత్యవసరం. సెస్నా విమానంతో చేసే ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర నగరాల్లో కూడా ఇదే తరహాలో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ఇది కూడా చదవండి: మరో నగరం పేరు మార్పు.. ముస్తఫాబాద్ ఇకపై..


