లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో నగరం పేరు మారనుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు చేశారు. సంత్ కబీర్‌తో ముస్తఫాబాద్‌కున్న సాంస్కృతిక సంబంధాన్ని గౌరవిస్తూ, ఆ నగరానికి కబీర్‌ధమ్‌గా పేరు మార్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో ముస్లిం జనాభా లేనప్పటికీ, ఆ ప్రాంతానికి ముస్తఫాబాద్ అని పేరు పెట్టడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
లఖిపూర్ ఖేరిలో జరిగిన ‘స్మృతి మహోత్సవ్ మేళా 2025’ లో పాల్గొన్న సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..ముస్తఫాబాద్ గురించి.. స్థానికులను ఇక్కడ ఎంత మంది ముస్లింలు నివసిస్తున్నారని అడిగినప్పుడు ఎవరూ లేరని చెప్పారన్నారు. దీంతో ఊరి పేరు మార్చాలని, ఇకపై కబీర్‌ధామ్ అని పిలవాలని వారితో చెప్పానన్నారు. ఈ పేరు మార్పు కోసం ప్రభుత్వం అధికారిక ప్రతిపాదనను కోరుతుందని, అవసరమైన పరిపాలనా చర్యలు తీసుకుంటుందని సీఎం యోగి అన్నారు.
గతంలో పాలకులు అయోధ్యను ఫైజాబాద్‌గా, ప్రయాగ్‌రాజ్‌ను అలహాబాద్‌గా, కబీర్‌ధామ్‌ను ముస్తఫాబాద్‌గా మార్చారని సీఎం యోగి పేర్కొన్నారు. అయితే తమ ప్రభుత్వం ఈ ప్రాంతాల పేర్లను పునరుద్ధరిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మతపరమైన స్థలాలను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందన్నారు. ప్రతి తీర్థయాత్ర స్థలాన్ని అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని, విశ్రాంతి గృహాలు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల సారధ్యంలో కాశీ, అయోధ్య, కుషినగర్, నైమిశారణ్యం, మధుర బృందావనం, బర్సానా, గోవర్ధనం తదితర పవిత్ర స్థలాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో ప్రభుత్వ ధనాన్నికబ్రిస్తాన్(స్మశానవాటికలు) సరిహద్దు గోడలను నిర్మించడానికి ఉపయోగించేవారని, ఇప్పుడు ప్రభుత్వ ధనాన్ని మతపరమైన కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు వినియోగిస్తున్నామన్నారు.


