500 ఏళ్ల సంకల్పం నెరవేరింది: ధ్వజారోహణలో ప్రధాని మోదీ | Prime Minister arrives at Ram Mandir for Dhwajarohan | Sakshi
Sakshi News home page

500 ఏళ్ల సంకల్పం నెరవేరింది: ధ్వజారోహణలో ప్రధాని మోదీ

Nov 25 2025 11:21 AM | Updated on Nov 25 2025 1:54 PM

Prime Minister arrives at Ram Mandir for Dhwajarohan

అయోధ్య: అయోధ్య రామాలయంపై కాషాయ వర్ణపు సూర్యవంశీ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోదీ..  రామాలయం నిర్మాణం పూర్తయినట్లు ప్రకటించారు. ధ్వజారోహణం కార్యక్రమంతో 500  ఏళ్ల నాటి సంకల్పం నెరవేరిందన్నారు. భారతీయులు తమ వారసత్వ సంపదపై గర్వపడాలని, బానిసత్వ మనస్తత్వం నుండి బయటపడాలని అన్నారు. దేశం పురోగతి సాధించాలంటే రాబోయే పదేళ్లలో భారతదేశాన్ని ఈ మనస్తత్వం నుండి విముక్తి చేయడమే తమ లక్ష్యమన్నారు.  ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గల నూతన రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం ఉదయం 11:55 గంటలకు శుభ అభిజిత్ ముహూర్తం సందర్భంగా ప్రారంభమై, 10 నిమిషాల పాటు సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్‌ సంయుక్తంగా ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేశారు. 

 


ఈ చారిత్రాత్మక ఘట్టం వేద మంత్రాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య జరిగింది.  దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. తరువాత ఆయన నగరంలో రోడ్‌షో నిర్వహిస్తూ, రామమందిరం వైపు తరలి వెళ్లారు. దారిలో ప్రజలు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. మార్గంమధ్యలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రిని స్వాగతించారు.

ధ్వజారోహణ వేడుకల సందర్భంగా  జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘ఈ రోజు అయోధ్యకు ఒక సాంస్కృతిక మేల్కొలుపు. ఒక చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యం. ప్రపంచమంతా శ్రీరాముని  భక్తిలో మునిగిపోయింది. శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నందున ప్రతి రామభక్తుడి హృదయం ఆనందంతో నిండిపోయింది’ అని అన్నారు. ఆలయంలో తాను ఎగురవేసిన కాషాయ జెండా సంకల్పానికి ప్రతీక అని, ఇది మనల్ని మేల్కొల్పుతుంది. అంకితభావం వైపు నడిపిస్తుందని అన్నారు. పతాకం అనేది బ్రహ్మ స్వరూపాన్ని సూచిస్తుంది. ఇక్కడ సత్యం, ధర్మం స్థాపితమయ్యాయి. వీటి విజయాన్ని ఇది సూచిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. నేడు భారతదేశం అంతా రామమయం అయ్యింది. ప్రతి రామ భక్తుడి హృదయంలో అసాధారణ సంతృప్తి నిండింది. అపరిమితమైన కృతజ్ఞత వ్యక్తమవుతోంది. శతాబ్దాల సంకల్పం నేడు నెరవేరిందని ప్రధాని మోదీ  అన్నారు.
 

ఒక వ్యక్తి ఉన్నతునిగా.. విలువలు, సంస్కృతి ద్వారా ఎలా రూపుదిద్దుకుంటాడో రాముడు ప్రపంచానికి చూపించిన నగరం అయోధ్య అని ప్రధాని మోదీ అన్నారు. రాముడు అయోధ్య నుండి వనవాసానికి వెళ్ళినప్పుడు, అతను ఒక యువరాజు, కానీ అతను తిరిగి వచ్చినప్పుడు, ధర్మానికి ప్రతిరూపంగా, మర్యాద పురుషోత్తమ రామునిగా తిరిగి వచ్చాడు అని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ‘ఈ రోజు అందరి ఆశలు నెరవేరిన  దినం. రామజన్మభూమి లక్ష్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి ఆత్మలు ఈ రోజు సంతృప్తి చెందుతాయి’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘ఈ పవిత్ర దినం.. రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలను త్యాగం చేసిన యోధులకు అంకితం అని అన్నారుకాగా రామమందిరంపై 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు గల కాషాయ జెండాను ఒక బటన్ నొక్కడం ద్వారా ప్రధాని మోదీ ఎగురవేశారు. జెండాపై రాముని పరాక్రమాన్ని సూచించే ప్రకాశవంతమైన సూర్యుని చిత్రం, ‘ఓం’, 'శిఖరం మొదలైనవి ఉన్నాయి.



 

 


రామ జన్మభూమిలో ధ్వజారోహణకు ముందు ప్రధాని నర్రేంద మోదీ వేద మంత్ర మంత్రోచ్ఛారణల నడుమ బాలక్‌ రామ్‌ను దర్శనం చేసుకున్నారు. ఈ సమయంలో ఆయన వెంట ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. అలాగే వీరిరువురూ శేషావతార మందిర్‌లో ప్రార్థనలు చేశారు. మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, మహర్షి వాల్మీకి, దేవి అహల్య, నిషాదరాజ్ గుహ, మాతా శబరిలను దర్శించారు.

PM Modi : అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ ఉత్సవం

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement