పోటీలు, శిక్షణలో ఉన్నా ‘ఆన్ డ్యూటీ’నే
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ క్రీడాకారులకు చెప్పుకోదగ్గ ఊరటనిచ్చింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలతో రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెస్తున్న క్రీడాకారులకు ఉద్యోగాలు కలి్పస్తోంది. కానీ ఈవెంట్ల కోసం వెళ్లినపుడు, శిక్షణ శిబిరాలకు హాజరైనపుడు గైర్హాజరైన కాలాన్ని సెలవులుగా పరిగణిస్తూ వచ్చారు.
అయితే ఇకపై పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లినా... శిక్షణలో ఉన్న కాలాన్ని సైతం ఆన్ డ్యూటీగానే పరిగణించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఆన్ డ్యూటీగా పరిగణించే ప్రతిపాదనను ఆమోదించింది.
చాన్నాళ్లుగా అగ్రశ్రేణి అథ్లెట్లకు సంబంధిత శాఖాధిపతుల నుంచి సెలవు అనుమతులు పొందడం ఇబ్బందికరంగా మారింది. తాజా ఆమోదం వల్ల దీనికి సంబంధించిన సరీ్వస్ రూల్స్‌లో ఆయా అథ్లెట్లకు వెసులుబాటు లభిస్తుంది. దీంతో క్రీడా ఈవెంట్లు, శిక్షణ శిబిరాలకు వెళ్లినపుడు సులువుగా అనుమతుల మంజూరు లభించడంతో పాటు ఆన్ డ్యూటీ ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.


