ఇక నుంచి అన్ని విద్యాసంస్థల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలాపన తప్పనిసరి చేస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వయంగా ఈ ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన.
లక్నో: సోమవారం ఏక్తా యాత్ర పేరిట గోరఖ్‌పూర్‌లో జరిగిన సామూహిక వందేమాతర ఆలాపన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ పాల్గొని మాట్లాడారు. ఐక్యత, దేశభక్తి భావనను విద్యార్థుల్లో నాటేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారాయన. ‘‘వందే మాతరానికి తగినంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే.. ప్రతి విద్యాసంస్థలో దీన్ని తప్పనిసరిగా ఆలపించాలి. దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది’’ అని అన్నారాయన.
ఈ సందర్భంగా.. వందే మాతరం వ్యతిరేకతపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నేతలు మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ అలీ జౌహర్ ఈ ఇద్దరూ ఆనాడు వందే మాతరాన్ని వ్యతిరేకించారు.. తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 1923లో జౌహర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వందే మాతరం ప్రదర్శించిన సమయంలో సభను వదిలి వెళ్లిపోయారు. ఒకరకంగా.. విభజనకు దారితీసిన కారణాల్లో అది కూడా ఒకటి. విభజన భావనలకు తావు లేకుండా, మరో జిన్నా పుట్టకూడదని ప్రజలు బలంగా కోరుకోవాలి. జాతీయ ఐక్యతను సవాల్ చేయాలనే దుస్సాహం ఎవరూ చేయకూడదు. అలాంటి ఆలోచనను కూకటి వేళ్లతో పెకిలించివేయాలి అని అన్నారాయన.
ఈ క్రమంలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి ఆయన చురకలంటించారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ ఎంపీ జాతీయ గేయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వాళ్లు భారత ఐక్యతకు శిల్పి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పట్టించుకోరు. కానీ, జిన్నాను గౌరవించే కార్యక్రమాలకు మాత్రం హాజరవుతుంటారు అని అన్నారాయన.
యోగి సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో వందే మాతరం పాడటం తప్పనిసరి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
వందే మాతరానికి 150 ఏళ్లు
బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఆనంద్‌మఠ్ నవలలోని బంగదర్శన్‌లో వందే మాతరం ఉంది. 1875 నవంబర్ 7వ తేదీన అక్షయ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ గేయాన్ని విడుదల చేశారు. ఆ తర్వాత స్వాతంత్ర్య పోరాటానికి ఈ గేయం ప్రేరణగా నిలిచింది. 150 సంవత్సరాలు పూర్తి కావడంతో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే మాతరం ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంలో వందే మాతరం భారత ఐక్యతకు ప్రతీక. ఇది దేశ ప్రజలకు కొత్త శక్తిని, ప్రేరణను ఇస్తుంది అని వ్యాఖ్యానించారు. 2026 నవంబర్ 7 వరకు వందే మాతరం ఉత్సవాలు కొనసాగనున్నాయి.


