న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కమ్ముకున్న దట్టమైన పొగమంచు, తక్కువ దృశ్యమానత కారణంగా దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు భారీ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. గురువారం ఒక్కరోజే వివిధ విమానాశ్రయాల నుండి ఏకంగా 67 విమానాలను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బెంగళూరు, వారణాసి, అగర్తల, చండీగఢ్ తదితర నగరాల్లో వాతావరణం అనుకూలించకపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. డిసెంబర్ 10 నుండి పొగమంచు కారణంగా ఇండిగో తరచూ అంతరాయాలను ఎదుర్కొంటోంది.
పొగమంచు పరిస్థితుల్లో విమానాల ల్యాండింగ్ కోసం పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. దీని ప్రకారం 50 మీటర్ల కంటే తక్కువ దృశ్యమానత ఉన్నప్పుడు కూడా ల్యాండ్ చేయగల అధునాతన విమానాలను, ప్రత్యేక శిక్షణ పొందిన పైలట్లను మాత్రమే విమానయాన సంస్థలు ఉపయోగించాలి. అయితే ఈ నిబంధనలను పాటించడంలో, వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో ఏర్పడిన వైఫల్యాలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇండిగో కేవలం వాతావరణం వల్లే కాకుండా, అంతర్గత కార్యాచరణ లోపాలతోనూ సతమతమవుతోంది.
ఇటీవల పైలట్ల విశ్రాంతి నిబంధనలు, సిబ్బంది కొరత కారణంగా తలెత్తిన గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఇండిగోపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ నేపధ్యంలో సంస్థ శీతాకాలపు షెడ్యూల్‌ను 10 శాతం మేరకు కోత విధించి, రోజువారీ విమానాల సంఖ్యను 1,930కి పరిమితం చేసింది. డిసెంబర్ ఆరంభంలో ఒకే రోజు 1,600 విమానాలు రద్దు అయిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వరుస వైఫల్యాల వెనుక ఉన్న మూల కారణాలను అన్వేషించేందుకు డీజీసీఏ ఇప్పటికే నలుగురు సభ్యుల ఉన్నత స్థాయి ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది, ఈ కమిటీ ఈ వారంలో తన నివేదికను సమర్పించనుంది.
మరోవైపు, గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి చూస్తున్న ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఐదు గంటలకు పైగా ఆలస్యమవుతున్న విమానాలు, సరైన సమాచారం లేకపోవడంపై సోషల్ మీడియా వేదికగా వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులతో ప్రయాణించే వారు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వాతావరణం అనే సాకు చెప్పకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణికులు తమ విమాన రాకపోకల స్థితిని తనిఖీ చేసుకుని బయలుదేరాలని ఇండిగో సూచించింది.
ఇది కూడా చదవండి: విష్ణు విగ్రహం కూల్చివేత.. థాయ్ వివరణ


