ట్రంప్ తాజా బెదిరింపులు
వాషింగ్టన్: కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ల బాంబు పేల్చారు. అమెరికాలో విక్రయించే కెనడా విమానాలపై ఏకంగా 50 శాతం సుంకాలు బాదుతానని ప్రకటించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌సోషల్ పోస్టులో ఈ మేరకు పేర్కొన్నారు. జార్జియాకు చెందిన అమెరికా కంపెనీ గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్‌కు చెందిన జెట్ విమానాలను సర్టిఫై చేసేందుకు కెనడా నిరాకరించిందంటూ ఆయన ఈ మేరకు బెదిరింపులకు దిగారు.
కెనడా నిర్ణయానికి ప్రతిచర్యగా బొంబార్డియర్‌తో పాటు ఆ దేశానికి చెందిన అన్ని కంపెనీల విమానాలనూ తాము కూడా డీసర్టిఫై చేస్తామని హెచ్చరించారు. బొంబార్డియర్ విమానాల గుర్తింపు రద్దు తక్షణం అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించారు. బొంబార్డియర్, గల్ఫ్‌స్ట్రీమ్ ఒకరకంగా ఆగర్భ శత్రువులు. ట్రంప్ ప్రకటనపై మాంట్రియల్‌కు చెందిన బొంబార్డియర్ కంపెనీ వెంటనే స్పందించింది. ఆయన హెచ్చరికలపై కెనడా ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు చెప్పింది.
కెనడాపై కత్తులు
కెనడాపై కొంతకాలంగా ట్రంప్ కత్తులు నూరుతున్నారు. ముఖ్యంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీకి, ఆయనకు నడుమ సంబంధాలు బాగా బెడిసికొట్టాయి. కార్నీని ట్రంప్ తరచూ ‘కెనడా గవర్నర్’ అని సంబోధిస్తూ హేళన చేస్తున్నారు. పెద్ద దేశాల ఒంటెత్తు పోకడల వల్ల అంతర్జాతీయ ఒప్పందాలకు విలువే లేకుండా పోతోందంటూ ట్రంప్ తీరును దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక నుంచే కార్నీ తూర్పారబట్టారు.
అప్పటినుంచీ వారి నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాపై టారిఫ్‌లను ఏకంగా 100 శాతానికి పెంచుతానని ఇటీవలే ట్రంప్ బెదిరించడం తెలిసిందే. అయినా కార్నీ చైనాలో పర్యటించడమే గాక ఆ దేశంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.


