ట్రంప్‌ మాత్రమే ప్రపంచ శాంతిని సాధించగలరు.. జపాన్‌ ప్రధాని | Japan leader tells Trump he alone can achieve peace | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ మాత్రమే ప్రపంచ శాంతిని సాధించగలరు.. జపాన్‌ ప్రధాని

Mar 19 2026 11:04 PM | Updated on Mar 20 2026 9:39 AM

Japan leader tells Trump he alone can achieve peace

పశ్చిమాసియాలో యుద్దం పతాకస్థాయికి చేరిన వేల జపాన్ ప్రధాన మంత్రి సనాఏ తకాఇచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ మాత్రమే ప్రపంచ శాంతిని సాధించగలరని ఆకాశానికెత్తారు. వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లో ట్రంప్‌తో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 

ప్రస్తుత ప్రపంచం తీవ్రమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో శాంతి సాధనకు అవసరమైన ధైర్యం, దృఢ సంకల్పం ట్రంప్ వద్ద మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం తరఫున ఈ సందేశాన్ని ట్రంప్‌కు అందిస్తున్నట్లు తెలిపారు.

ఇదే సందర్భంగా తకాఇచి ఇరాన్‌తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తున్నామని అన్నారు. హర్ముజ్ జలసంధి మూసివేత విషయంలో ఇరాన్‌ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటం అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు.  

ఈ సమావేశం ద్వారా జపాన్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. జపాన్, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ప్రధాన మిత్రదేశంగా ఉంది. పెరుగుతున్న చైనా ప్రభావం, ఉత్తర కొరియా అణు పరీక్షలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు వంటి అంశాల నడుమ రెండు దేశాలు మరింత దగ్గరగా పనిచేయాల్సిన అవసరాన్ని పెంచుతున్నాయి. 

తకాఇచి వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై విస్తృత చర్చకు దారితీశాయి. ప్రపంచ శాంతి సాధనలో ట్రంప్‌ను ఏకైక నాయకుడిగా అభివర్ణించడం అమెరికా వ్యతిరేకులకు మింగుడుపడటం​ లేదు. ఈ వ్యాఖ్యలు ఇతర ప్రపంచ నాయకుల పాత్రను తగ్గించి చూపుతున్నాయనే విమర్శలూ వినిపిస్తున్నాయి.  

జపాన్‌ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ట్రంప్‌ స్పందించారు. రెండు దేశాల మధ్య స్నేహం, భాగస్వామ్యం ప్రపంచ శాంతి సాధనలో కీలకమని అన్నారు. జపాన్ ఎల్లప్పుడూ అమెరికాకు విశ్వసనీయ మిత్రదేశమని పేర్కొన్నారు. మేము కలిసి పనిచేస్తే ఏ సమస్యనైనా ఎదుర్కొనగలమని ధీమా వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement