ఇజ్రాయెల్‌ తప్పు చేసింది : డొనాల్డ్‌ ట్రంప్‌ | No More South Pars Attacks, Says Donald Trump After Iran Hits Qatar LNG Plant | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ తప్పు చేసింది : డొనాల్డ్‌ ట్రంప్‌

Mar 19 2026 10:20 AM | Updated on Mar 19 2026 1:00 PM

No More South Pars Attacks, Says Donald Trump After Iran Hits Qatar LNG Plant

వాషింగ్టన్‌: పశ్చిమాశియా దేశాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి చేయగా, ప్రతీకారంగా ఇరాన్ ఖతర్‌లోని ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్‌.. సౌత్‌ పార్స్‌గ్యాస్‌ ఫీల్డ్‌పై దాడి చేయడం ముమ్మాటికి తప్పే. ఇజ్రాయెల్‌ దాడి చేసిందని మీరు ఖతర్‌పై దాడి చేస్తే ఉపేక్షించబోమంటూ ట్రంప్‌ టూత్‌ సోషల్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.  

ఆ ట్వీట్‌లో ఇజ్రాయెల్ ఇకపై దాడులు చేయదని, కానీ ఇరాన్ ఖతర్‌పై మళ్లీ దాడి చేస్తే అమెరికా స్వయంగా ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్ ఖతర్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని హబ్షన్ గ్యాస్ ఫెసిలిటీ, బాబ్ ఫీల్డ్‌లపై కూడా దాడులు జరిపింది. ఈ దాడులు గల్ఫ్ దేశాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి.  ఇరాన్ చర్యలతో ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్‌జలసంధి ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.  

పశ్చిమాసియాలో జరిగిన పరిణామాలపై ఆగ్రహంతో ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ అనే ప్రధాన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో కేంద్రంలోని ఒక చిన్న భాగమే దెబ్బతింది. ఈ ప్రత్యేక దాడి గురించి అమెరికాకు ఎలాంటి సమాచారం లేదు. ఈదాడికి ఖతర్‌కు ఏవిధమైన సంబంధం లేదు. ఈ దాడి జరగబోతుందని ఖతర్‌కు తెలియదు’అని పేర్కొన్నారు.  

తాజా పరిణామం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. బ్రెంట్ క్రూడ్ ధరలు మరో 5 శాతం పెరిగి బ్యారెల్‌కు 108 డాలర్లకు చేరాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చమురు ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. ఇది దిగుమతులపై ఆధారపడే దేశాలకు, ముఖ్యంగా భారత్‌పై సైతం ఆర్థిక భారాన్ని మోపే అవకాశం ఉంది. మొత్తం మీద, ఇరాన్‌పై అమెరియా-ఇజ్రాయెల్ యుద్ధం సహజవనరుల భద్రతను కుదిపేస్తోంది. ఖతర్, యూఏఈపై దాడులు, అమెరికా హెచ్చరికలు, చమురు ధరల పెరుగుదల పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరత వైపు నెడుతున్నాయని ఆర్థిక నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement