బ్యాంకాక్: థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లొ విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేతపై థాయ్‌లాండ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ చర్య భద్రతా కారణాలతో కూడుకున్నదని, మతపరమైన ఉద్దేశాలు ఏవీ లేవని అధికారులు తెలిపారు. సరిహద్దు నిర్వహణ, నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్-కంబోడియన్ సరిహద్దు ప్రెస్ సెంటర్ మీడియాకు వెల్లడించింది.
2014లో నిర్మితమైన ఈ విగ్రహాన్ని థాయ్ సైనిక సిబ్బంది బ్యాక్‌హో లోడర్‌తో కూల్చివేస్తున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఈ నిర్మాణం తమ భూభాగంలోని చోంగ్ అన్ మా ప్రాంతంలో ఉందని, సార్వభౌమత్వాన్ని తెలియజేసేందుకే కంబోడియా సైనికులు దీనిని నిర్మించారని థాయ్ అధికారులు చెబుతున్నారు. హిందూ మతంతో తమకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గౌరవిస్తామని, అయితే సరిహద్దు ఉద్రిక్తతలను పెంచే చిహ్నాలను నిరోధించడమే తమ ప్రాధాన్యతని వారు తెలిపారు.
ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. థాయిలాండ్ మరియు కంబోడియా దేశాలు రెండూ సంయమనం పాటించాలని, వివాదాలను చర్చలు మరియు దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.
మరోవైపు, కంబోడియా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ భూభాగంలోని ప్రీహ్ విహార్ ప్రావిన్స్‌లో ఉన్న విగ్రహాన్ని థాయ్ దళాలు ధ్వంసం చేశాయని ఆరోపించింది. ఈ సరిహద్దు వివాదం కారణంగా గతంలో ఘర్షణలు ఏర్పడి పలువరు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, మతపరమైన కట్టడాల రక్షణపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
ఇది కూడా చదవండి: టీచర్‌పై తూటాల వర్షం.. వర్శిటీలో దారుణం


