ఉన్నావ్ కేసు రాజకీయ మలుపు తీసుకుంటోంది. నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు బెయిల్ రావడంపై అభ్యంతరాలతో బాధితురాలు, ఆమె తల్లి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అయితే.. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది వాళ్లను మీడియాతో మాట్లాడనీయకుండా.. బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో..
ఆ తల్లీకూతుళ్లు బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. జర్మనీ పర్యటన ముగించుకుని నిన్ననే వచ్చిన రాహుల్.. ఈ కేసు పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులకు బెయిల్.. బాధితులను నేరస్తుల్లా చూస్తారా?.. ఇదెక్కడి న్యాయం??. భారతదేశం కేవలం మృత ఆర్థిక వ్యవస్థగా(డెడ్ ఎకానమీ) మాత్రమే కాకుండా.. మృత సమాజంగా(డెడ్ సొసైటీ) కూడా మారుతోందని అంటూ ఇండియన్ గేట్ పరిణామంపై ఓ ట్వీట్ చేశారు.
क्या एक गैंगरेप पीड़िता के साथ ऐसा व्यवहार उचित है?
क्या उसकी “गलती” ये है कि वो न्याय के लिए अपनी आवाज़ उठाने की हिम्मत कर रही है?
उसके अपराधी (पूर्व BJP MLA) को ज़मानत मिलना बेहद निराशाजनक और शर्मनाक है - खासकर तब, जब पीड़िता को बार-बार प्रताड़ित किया जा रहा हो, और वो डर के… https://t.co/BZqrVNXMOy— Rahul Gandhi (@RahulGandhi) December 24, 2025
బుధవారం సాయంత్రం జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన బాధితురాలు, ఆమె తల్లి.. రాహుల్ గాంధీని కలిసి ఉన్నావ్ కేసు పురోగతిని.. తమకు ప్రాణహాని పొంచి ఉన్న విషయాన్ని తెలియజేయడమే కాకుండా పారామిలిటరీ సిబ్బంది తమతో ఎంత దురుసుగా ప్రవర్తించింది కూడా వివరించినట్లు తెలుస్తోంది. కుటుంబం కోసమే తానింకా బతికి ఉన్నానని.. తన పోరాటం ఆగదని బాధితురాలు రాహుల్‌కి చెప్పినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు.. ప్రతిపక్ష నేతనే కాదు.. ప్రధానిని కూడా కలిసే ప్రయత్నం చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపింది. ‘‘ప్రధాని, కేంద్ర హోం మంత్రి, రాష్ట్రపతిని కూడా కలవాలని ఉంది. వాళ్లను కలిసి మేం ఎదుర్కొంటున్న పరిస్థితులను చెప్పాలనుకుంటున్నాం. మాకు కావాల్సింది న్యాయం.. అంతే’’ అని చెప్పిందామె.
కోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ‘‘ఈ తీర్పుతో దేశంలోని అడబిడ్డలు తమ మానప్రాణాల కోసం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నేరానికి పాల్పడిన వ్యక్తిని మా ఇంటికి 5 కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదని కోర్టు ఆదేశించింది. అంటే.. మేం ఇంటిలోనే బంధీగా ఉండాలని కోర్టు ఉద్దేశమా?’’ అని ఆందోళన వ్యక్తం చేసిందామె. అయితే తమ ఆశలు చావలేదని.. సుప్రీం కోర్టులో న్యాయం దక్కుతుందనే ఆశ నెలకొందని బాధితురాలు అంటోంది. ఇదిలా ఉంటే.. సెంగర్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో బాధితురాలు ఓ పిటిషన్ వేసింది.
2017లో ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆనాడ.. మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్, ఆపై ఆమెను అమ్మే ప్రయత్నమూ చేశారు. ఈ ఘటనతో పార్టీ అంతేకాదు.. ఈ కేసు వెలుగులోకి వచ్చాక ఆమె తండ్రి హత్యకు గురికావడంతో పాటు బాధితురాలిపైనా హత్యాయత్నం జరిగాయి. అదృష్టవశాత్తూ ఆమె ప్రమాదం నుంచి బయటపడగా ఇద్దరు బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు.
సీబీఐ దర్యాప్తు అనంతరం.. ఈ అభియోగాలన్నింటిని నిజాలుగా నిర్ధారించుకున్న ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్‌లో సెంగర్‌కి జీవితఖైదు విధించింది. ఆ సమయంలో పార్టీ ఆయన్ని బహిష్కరించింది. అయితే ఈ శిక్షను సెంగర్ సవాల్ చేయగా.. మంగళవారం(డిసెంబర్ 23, 2025) ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. దీంతో నిందితుడు బయటకు వస్తే తమకు ప్రాణహాని తప్పదని ఆ తల్లీకూతుళ్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరుగుతుండడం.. సెంగార్ వర్గ ఓట్లను ఆకర్షించేందుకే కుల్దీప్‌ను బయటకు తెచ్చారనే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి వ్యాఖ్యల దుమారం
ఉన్నావ్ బాధిత కుటుంబం నిరసన తెలపకుండా ఢిల్లీ ఇండియన్ గేట్ వద్ద పారామిలిటరీ సిబ్బంది అడ్డుకోవడంపై ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు వెటకారంగా స్పందించారు. ‘‘ఆమెది ఉన్నావ్ కదా.. ఢిల్లీలో ఏం పని?’’ అంటూ యూపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ బిగ్గరగా నవ్వారు. ఈ వీడియో నెట్టింటకు చేరడంతో జనం ఆయన్ని తిట్టిపోస్తున్నారు.


