10 ల‌క్ష‌లకే డ‌బుల్ బెడ్‌రూం ఫ్లాట్‌! | UP Government Affordable Housing Scheme, 72 Flats For The Poor On Land Freed From Mafia Control, More Details | Sakshi
Sakshi News home page

UP Housing Scheme: వావ్‌.. త‌క్కువ ధ‌రకే డ‌బుల్ బెడ్‌రూం ఫ్లాట్‌!

Nov 8 2025 7:36 PM | Updated on Nov 8 2025 8:33 PM

Double Bedroom flat Priced at 10 lakh here details

సిటీలో డ‌బుల్ బెడ్‌రూం ఫ్లాట్ కొనాలంటే త‌క్కువ‌లో త‌క్కువ రూ. 50 ల‌క్ష‌లైనా అవుతుంది. కానీ 10 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కే రెండు ప‌డ‌కల ఫ్లాట్.. అది కూడా న‌గ‌రంలో అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌మాన‌దు. ఇంత త‌క్కువ‌కి ఎక్క‌డ అమ్ముతున్నార‌ని అనుకుంటున్నారా? ప్ర‌భుత్వమే క‌ట్టించి, ముఖ్య‌మంత్రే స్వ‌యంగా మీకు ఇంటి తాళాలు అప్ప‌గిస్తే..! ఏంటి న‌మ్మడం లేదా? అయితే ప‌దండి.. ఆ వివ‌రాలు తెలుసుకుందాం.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి యోగి ఆదిత్య‌నాథ్ (Yogi Adityanath) ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత చాలా మార్పులు వ‌చ్చాయి. ముఖ్యంగా రౌడీలు, సంఘ విద్రోహ శ‌క్తుల‌ను ఉక్కుపాదంతో అణివేస్తున్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే వారిని ఏమాత్రం ఉపేక్షించ‌డం లేదు. ఇలాంటి చ‌ర్య‌ల్లో భాగంగా మాఫియా నాయకుడు ముఖ్తార్ అన్సారీ.. ల‌క్నోలోని దాలిబాగ్ ప్రాంతంలో ఆక్ర‌మించిన సుమారు 2,322 చదరపు మీటర్ల భూమిని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో పేద‌ల‌కు ఇళ్లు నిర్మించింది.

సర్దార్ వల్లభాయ్ పటేల్ హౌసింగ్ స్కీమ్ (Sardar Vallabhbhai Patel Housing Scheme) కింద‌ లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ (LDA) ఈ ఫ్లాట్‌ల‌ను నిర్మించింది. ఈ ప్రాజెక్ట్‌లో మూడు G+3 బ్లాక్‌లలో 72 ఫ్లాట్‌లు ఉన్నాయి. ఒక్కొ ఫ్లాట్‌ 36.65 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. లాటరీ ప్రక్రియ ద్వారా ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేశారు. ఒక్కో ఫ్లాట్ ధ‌ర ₹10.70 ల‌క్ష‌లు. ఈ గృహ సముదాయంలో స్వచ్ఛమైన నీరు, విద్యుత్, సెక్యురిటీ, ద్విచక్ర వాహన పార్కింగ్ ,రోడ్లు, పార్కులు వంటి స‌దుపాయాల‌న్నీ ఉన్నాయి.

అక్ర‌మార్కుల ఆటలు సాగ‌వు
కార్తీక పౌర్ణ‌మి రోజున సీఎం యోగి ఆధిత్య‌నాథ్ ఈ గృహ సముదాయం ప్రారంభించారు. ల‌బ్ధిదారుల‌కు స్వ‌యంగా ఇంటి తాళాలు అందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ భూముల‌ను చెర‌బ‌ట్టిన‌ అక్ర‌మార్కుల ఆట క‌ట్టిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. "ఇది కేవలం ఇళ్ల పంపిణీ కార్యక్రమం కాదు, ఒకప్పుడు మాఫియా ఆక్రమించిన భూమిలో ఇప్పుడు పేదలు ఇళ్లు ద‌క్కాయ‌నే  సందేశం ఇది. సంఘ విద్రోహ చ‌ర్య‌ల‌కు పాల్పడుతూ పేద‌ల‌ను దోపిడీ చేసే వారి ఆట‌లు ఉత్తరప్రదేశ్‌లో ఇక‌పై సాగ‌బోవు. ప్రతి పౌరుడి హక్కులను కాపాడటానికి మా ప్రభుత్వం గ‌ట్టిగా నిల‌బ‌డుతుంది. ఇది నూత‌న భారతదేశం, ఉత్తరప్రదేశ్ యొక్క గుర్తింపు. ఇక్కడ విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలతో కలిసి అభివృద్ధి నడుస్తుంది. కార్తీక పౌర్ణ‌మి ప‌ర్వ‌దినాన లక్నోలో మాఫియా లేని భూమిలో లబ్ధిదారులకు గృహాలను అందించడం నిజంగా గర్వకారణమ‌''ని యోగి ఆదిత్య‌నాథ్ అన్నారు.

చ‌ద‌వండి: బిహార్ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం

ఒక్కో ఫ్లాట్ విలువ రూ. కోటి!
గృహ సముదాయం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ల‌బ్ధిదారుల‌కు ముఖ్య‌మంత్రి స్వయంగా బహుమతులు పంపిణీ చేశారు. నివాసితుల‌ పిల్లలతో అప్యాయంగా మాట్లాడారు. వారికి చాక్లెట్లు పంచారు. నివాస ప్రాంగ‌ణంలో మొక్క‌లు నాటారు. కాగా, ల‌క్నోలోని ప్రైమ్ ఏరియాలో నిర్మించిన ఈ ఫ్లాట్ల‌ను ద‌క్కించుకునేందుకు 8,000 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, వారిలో 5,700 మంది అర్హులని గుర్తించారు. వీరిలో 72 మంది ఫ్లాట్‌ల‌ను ద‌క్కించుకున్నారు. ఒక్కో ఫ్లాట్ విలువ మార్కెట్ ధ‌ర ప్ర‌కారం దాదాపు కోటి రూపాయ‌ల‌కు వ‌ర‌కు ఉంటుంద‌ని సీఎం యోగి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement