అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనశక్తి జనతాదళ్ (JJD) నేత తేజ్ ప్రతాప్ యాదవ్, బీజేపీ ఎంపీ రవి కిషన్ (BJP MP Ravi Kishan) ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఊహాగాహానాలు మొదలైపోయాయి. ఎన్డీఏ కూటమితో తేజ్ ప్రతాప్ చేతులు కలుపుతారనే ప్రచారం జోరందుకుంది. ఎన్నికల అనంతరం జరిగే పరిణామాలపై తేజ్ ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు ఊతం ఇచ్చాయి.
రవి కిషన్‌ను తొలిసారి కలిశా
పట్నా విమానాశ్రయంలో శుక్రవారం రవి కిషన్‌తో కలిసి కనిపించారు తేజ్ ప్రతాప్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తొలగించి యువతకు ఉపాధి కల్పించే వారితోనే తాను ఉంటానని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకుడిగా మారిన నటుడు రవి కిషన్‌ను తొలిసారిగా కలిసినట్టు చెప్పారు. ఆయన దేవుడి భక్తుడని, తాను కూడా భక్తుడినే అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఎన్నికల తర్వాత పొత్తు గురించి ప్రశ్నించగా.. "ఆప్షన్లు తెరిచి ఉన్నాయి. వేల ఎంపికలు ఉన్నాయి. విజయం తర్వాత, అన్ని ఎంపికలు తెరిచే ఉంటాయిని జవాబిచ్చారు.
ఇందులో రహస్యం లేదు: రవి కిషన్
తేజ్ ప్రతాప్ మంచి మనసున్న వ్యక్తి, భోలేనాథ్ భక్తుడని ఎంపీ రవి కిషన్ ప్రశంసించారు. ఎటువంటి వ్యక్తిగత ఎజెండా లేకుండా ప్రజలకు సేవ చేయాలనుకునే వారి కోసం కాషాయ పార్టీ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఇందులో ఎటువంటి రహస్యం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, తేజ్ ప్రతాప్, రవి కిషన్ కలయిక బిహార్ రాజకీయాల్లో (Bihar Politics) అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే తేజ్ ప్రతాప్, ఆయన పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఎన్నికల తర్వాత తెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
చదవండి: బిహార్ ఎన్నికల్లో టాప్-10 ధనిక అభ్యర్థులు వీరే
ఆత్మగౌరవమే ముఖ్యం
తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నుంచి బహిష్కరణకు గురయ్యారు. 12 ఏళ్లుగా ఓ మహిళతో అనైతిక సంబంధం కొనసాగించారనే ఆరోపణలతో ఆయనను ఆర్జేడీ నుంచి బయటకు పంపించారు. అయితే ఈ ఆరోపణలను తేజ్ ప్రతాప్ తోసిపుచ్చారు. ప్రాణం పోయినా తిరిగి ఆర్జేడీలోకి వెళ్లబోనని ఆయన శపథం చేశారు. అధికారం పట్ల వ్యామోహం లేదని, ఆత్మగౌరవమే తనకు ముఖ్యమన్నారు. తర్వాత సొంతంగా జనశక్తి జనతాదళ్ పార్టీని సొంతంగా స్థాపించారు.
ముగిసిన తొలి దశ పోలింగ్
బిహార్‌లో మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న ముగిసింది. 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాలకు మొదటి దశ పోలింగ్ జరిగింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దాదాపు 65 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. 14న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కాగా, తేజ్ ప్రతాప్ యాదవ్ పోటీ చేసిన మహువా నియోజకవర్గంలో పోలింగ్ పూర్తయింది. జనశక్తి జనతాదళ్ తరపున 22 మంది అభ్యర్థులను పోటీకి నిలబెట్టారు. వీరందరికీ బ్లాక్‌బోర్డ్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.


