విశ్లేషణ
బిహార్‌లో పేరు నమోదు చేయించుకుని అక్కడ ఓటు వేసేందుకు ఢిల్లీ, హరియాణా లాంటి రాష్ట్రాల నుంచి వేలాది ఓటర్లు తరలివెళ్లినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఢిల్లీ జాబితా నుంచి తన పేరు కొట్టేయించుకుని, బిహార్‌లో నమోదు చేసుకున్నారంటూ ఇందుకు ఉదాహరణగా మార్మోగింది. ఇది నిజ మైతే, ఇది చట్టవిరుద్ధమైన ఆచారం.
మీ ‘సాధారణ నివాస స్థలం’ ఏదో అక్కడే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకోవాలి. భారత ఎన్నికల చట్టాలు ఈ విష యాన్ని స్పష్టంగా పేర్కొంటున్నాయి. మీ ఇల్లు, సొంతూరి మీద మీ ప్రేమ... ఇవేవీ ఓటు హక్కు పొందడానికి అర్హతలు కావు. మీరు వాస్తవంగా నివసిస్తున్న చోటు మాత్రమే మీ సాధారణ నివాసం అవుతుంది.
సాధారణ నివాసమే ప్రాతిపదిక
ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 19 ప్రకారం, ఒక వ్యక్తికి తను ‘సాధారణ నివాసి’గా ఉన్న నియోజక వర్గంలో మాత్రమే ఓటరుగా నమోదు చేయించుకోవడానికి అర్హత ఉంటుంది. 17, 18 సెక్షన్లు మరో రెండు నిబంధనలను జత చేశాయి. మీరు ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో నమోదు కాలేరు. ఒకే నియోజకవర్గంలోనూ ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదు అయ్యే వీల్లేదు. ఈ రెండు నిబంధనలూ మార్చడానికి వీల్లేనివి (నాన్–నెగోషియబుల్).
‘సాధారణ నివాసి’ అంటే ఏమిటో సెక్షన్ 20 వివరిస్తుంది. సొంత ఆస్తి ఉన్నంత మాత్రాన ఒక ప్రదేశంలో సాధారణ నివాసి కాలేరని ఇది స్పష్టం చేస్తోంది. సాధారణ నివాసం అనేది వాస్తవ ఆధారితంగా ఉంటుంది. నిరంతరం అక్కడే ఉంటున్నారా, లేదా అన్నది ప్రధానం అంటే, మీరు స్వతహాగా అక్కడ ఉంటారు, మున్ముందు కూడా అక్కడే ఉండాలనుకుంటారు. తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తున్నా నివాస హోదా మారదు. చివరిగా, మార్పులు చేర్పులకు సంబంధించి ఏవి తప్పుడు ప్రకటనలు అవుతాయో సెక్షన్ 31 చెబుతోంది.
కొత్త ప్రాంతంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు వేరే చోట అప్పటికే తన పేరు నమోదై ఉన్నదనే వాస్తవం దాచిపెట్టడం క్రిమినల్ నేరం. దీనికి ఏడాది వరకు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే వీలుంది. పని నిమిత్తమో, పర్యటనల నిమిత్తమో వేరే ప్రదేశానికి వెళ్లి తాత్కాలికంగా చిరునామాలో లేనంత మాత్రాన అక్కడి ఓటు హక్కు పోదు. అది కొన్ని వారాలు లేనందున పోయేదీ కాదు, పోలింగ్ ముందు అక్కడకు రాగానే వచ్చేదీ కాదు! ఆరు నెలల వ్యవధిని సాధారణ నివాసం కింద భారత ఎన్నికల సంఘం పరిగణిస్తుంది.
వ్యూహాత్మక తరలింపులను ఆపాలి!
ఓటర్లను బస్సుల్లో తరలించి వలస వెళ్లిన వారంటూ వారి పేర్లను జాబితాల్లో నమోదు చేయడం, తర్వాత ఢిల్లీ లేదా హరి యాణాలో మళ్లీ నమోదు చేయించాలని ప్లాన్ చేయడం ప్రజా ప్రాతి నిధ్యాన్ని పక్కదారి పట్టించడమే! ఆ ప్రాంతంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, నీటి సరఫరా, రోడ్లు, పోలీసు వ్యవస్థలను వినియో గించుకునే సాధారణ నివాసుల అభిమతం నియోజకవర్గ ప్రాతి నిధ్యంలో ప్రతిబింబిస్తుందని రాజ్యాంగం తలుస్తోంది. జరుగుతున్న ఈ తరలింపుల ప్రహసనం అందుకు భిన్నం.
వాస్తవంగా వలస వెళ్లిన కార్మికుల, విద్యార్థుల ఓట్ల నమోదును కష్టతరం చేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఇప్పుడు చేయ వలసిందల్లా నిజమైన వలసల నుంచి వ్యూహాత్మక తరలింపులను వేరు చేయాలి. ఈ దిశగా అనుసరించదగిన అయిదు మార్గాలు:
(1) నోటీసు ఇచ్చి విచారణ జరిపిన తర్వాత ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో సాధారణ నివాసం ఉండటం లేదని తేలితే ఆ వ్యక్తి పేరు జాబితా నుంచి తొలగించడానికి చట్టం ఇప్పటికే వీలు కల్పిస్తోంది. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఇరుగు పొరుగువారి ప్రకటనలను తప్పనిసరిగా రికార్డ్ చేయాలి. ఇంట్లో ఉంటున్నదీ లేనిదీ ధ్రువీకరించాలి. సంతకం చేసి నివేదికలు సమ ర్పించాలి. ఈఆర్‌ఓలు ప్రతి కేసుపై దృష్టి సారించాలి.
(2) క్రాస్–స్టేట్ డూప్లికేషన్ నివారణ: వేరొక రాష్ట్ర ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్న వ్యక్తుల నుంచి వచ్చే ఫారం
6 దరఖాస్తులను ఆటోమేటిక్‌గా గుర్తించేట్లు ఈఆర్‌ఓ–నెట్‌లో తగు ఏర్పాట్లు ఉండాలి. అటువంటి అభ్యర్థనల్ని ఆమోదించే ముందు గట్టి రుజువులు (ఇటీవలి అద్దె ఒప్పందాలు, ఉపాధి/విద్య సర్టిఫి కెట్లు, యుటిలిటీ బిల్లులు) తీసుకోవాలి.
(3) నేర నిరోధకత: తెలిసీ తప్పుడు ప్రకటన (‘‘నేను మరె క్కడా నమోదు కాలేదు’’) చేస్తూ ఫారమ్ 6ను దాఖలు చేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం నేరం. వేళ్ల సంఖ్యలో కేసులు ఎంపిక చేసి కఠిన శిక్షలు పడేట్లు చేస్తే, అవే వేలాది హెచ్చ రికలుగా పని చేస్తాయి. లక్ష్యం సామూహిక శిక్ష కాదు, ఉద్దేశ పూర్వకంగా తప్పుదారి పట్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలియజెప్పడం!
(4) ఎన్నికల అనంతరం ఆడిటింగ్: పోలింగ్ అనంతరం మూడు నెలలు గడిచాక, సున్నిత ప్రాంతాలలో ‘కొత్త ఓటర్ల‘
శాంపిల్ తీసుకుని విశ్లేషించాలి. వారిలో చాలా మంది సంబంధిత ప్రాంతంలో ఎప్పుడూ లేరని తేలితే అది చర్య తీసుకోదగిన సాక్ష్యం అవుతుంది.
(5) నిజమైన వలసదారుకు రక్షణ: పేదలు, నిజంగా నివా సాలు మారేవారు, వేరే ప్రాంతాలకు వెళ్లి వస్తూ ఉండేవారు తమకు అందుబాటులో ఉండే పత్రాల ద్వారా తమ ఓటు నమోదు చేయించుకోవడాన్ని సులభతరం చేయాలి. బీఎల్‌ఓ నిర్ధారించిన స్వీయ ధ్రువీకరణ నివాస పత్రం, యజమాని లేదా సంస్థ ఇచ్చే ధ్రువీకరణ పత్రం వంటి వాటిని అంగీకరించాలి.
చివరి మాట
విస్తృత చర్చకు దారితీసిన ప్రొఫెసర్ మాటేమిటి? అతడు నిజంగా ఢిల్లీలో సాధారణ నివాసం ఉండకుండా బిహార్‌కు వెళ్లి అక్కడే వాస్తవంగా నివసిస్తూ ఉంటే, బిహార్‌లో అతడి ఓటు హక్కు నమోదు చట్టబద్ధమైనదే. అయితే, అది ఢిల్లీలో తొలగించబడి ఉండాలి. నివాసం మార్చకుండా, ఢిల్లీ జాబితాలో పేరు కొట్టేయించుకుని, బిహార్‌లో ఓటు వేయడానికి అక్కడ నమోదు చేసుకుని ఉంటే, తర్వాత ఢిల్లీ ఓటరుగా మళ్లీ నమోదు చేయించుకోవాలని ప్లాన్ చేస్తే తీవ్ర చర్యలు తీసుకోవాలి. రూల్ ఒక చిన్న వాక్యంగా చెప్పగలిగినంత సరళమైనది.
మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఓటు వేయండి. మీ తాత ముత్తాతల ఇల్లు తాళం పడిన చోట కాదు! మీ పార్టీ మిమ్మల్ని ఒక వారం పాటు ఉండమని కోరుకున్న చోట కాదు!! పోలింగ్ రోజున సుఖప్రదంగా ఉండే చోట కాదు!! సాధారణ నివాసం అనేది ఆఖరికి విద్యార్థులు, సీజనల్ కార్మికులు, నిరాశ్రయులకు కూడా ఓటరుగా నమోదు చేసుకునే వీలు కల్పిస్తుంది. ఎన్నికల ‘పర్యాటకం’ ఎప్పటికీ మంచి ప్రజాస్వామ్యం కాదు. ఇలాంటి పర్యాటకానికి ద్వారాలు మూసేయాలి.

ఎస్.వై. ఖురేషి
వ్యాసకర్త కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్


