అభిప్రాయం
గుర్తుండే ఉంటుంది, 2022లో నిస్సాగు నిరసన చేపట్టారు కొందరు పెద్ద రైతులు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించడం వల్ల పూర్వంలా కూలీలు తక్కువ దినవేతనాలకు దొరకడం లేదన్నది వారి అసంతృప్తికి కారణం. అందువల్ల తమ సాగు వ్యయ భారం పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆసారి సాగు విరామాన్ని పాటించారు. ఉపాధి పథకం కార్మికుల చేత రైతుల వ్యక్తిగత వ్యవసాయ పనులు చేయించాలన్న డిమాండ్‌కు మద్దతుగానూ ఇది జరిగింది. ఈ పథకం వల్ల కూలీలు ప్రియ మైపోయారన్నదే నిజమైతే, రైతులు వారిని భరించలేకపోతున్నా రన్నదే వాస్తవమైతే ఆ మేరకు పంటల మద్దతు ధరను పెంచి ఆదు కోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి దానిని సాధించుకోవచ్చు. రైతుల సమస్య అదొక్కటే కాదు.
ఉపాధి పథకం భూమిలేని నిరుపేద వ్యవసాయ కార్మికుల్లో కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంచినమాట నిజమే. వాస్తవానికి అది
అంత గొప్ప పథకమేమీ కాదు. పేద కార్మికులకు తమ కాళ్ళ మీద తాము బతగ్గలిగే పూర్తి స్థాయి బలాన్ని అది కల్పించలేదు. వారి చేతిలోని ఊతకర్రకు కొంచెం అదనపు ఊతాన్ని మాత్రమే ఇచ్చింది. దానికే వారు తమను దాటిపోతున్నారని దేశమంతటా గల పెద్ద రైతులు భావించడం విడ్డూరం. దీని మూలాల్లో ఫ్యూడల్ శక్తుల అసహనం ఇమిడి ఉన్నదనే అభిప్రాయాన్ని తోసిపుచ్చలేము. ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు గాంధీ పేరు తీసేసి, ‘వీబీ జీ రామ్ జీ’ చట్టాన్ని తెచ్చింది.
పేద వర్గాల పొట్ట కొట్టి...
గత పథకంలో మాదిరిగా ఈ కొత్తది డిమాండ్ ఆధారంగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించబోవడం లేదు. పనిని హక్కుగా గుర్తించి దానిని కల్పించడం తన బాధ్యతగా ఎన్డీయే ప్రభుత్వం భావించడం లేదు. కేంద్రం తాను అనుకున్న చోట మాత్రమే ఈ పథకం కింద పనులు మంజూరు చేస్తుంది. డిమాండ్ ఆధారిత పని కల్పనకు తెర దించబోతున్నారు. పథకం మొత్తం ఖర్చులో పూర్వం మాదిరిగా 90 శాతానికి బదులు 60 శాతం నిధులనే కేంద్రం భరిస్తుంది. అందువల్ల రాష్ట్రాల వాటా 10 నుంచి 40 శాతానికి చేరుకుని భారీగా పెరిగిపోనున్నది.
అన్నింటికీ మించి సాగు సీజన్లో 60 రోజులపాటు ఉపాధి పనులను నిలిపివేయడం కొత్త పథకంలోని ప్రధానమైన ప్రజావ్యతిరేక లక్షణం. మహాత్మా గాంధీ ‘నరేగా’ కార్మి కులకు ప్రసాదించిన ఉపాధి భరోసా ఈ విధంగా డొల్ల అయి పోతుందన్న మాట! దీనితో ముమ్మర సీజన్లో అధిక కూలీని సాధించుకునే హక్కును కార్మికులు కోల్పోనున్నారు. పేదలు, అణగారిన వర్గాలు పెత్తందారుల కింద బతకాలనే వ్యవస్థను పునరుద్ధరించాలని బీజేపీ కోరుకుంటున్నది. హిందూ సమాజ రక్షణే తమ విధి అని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఇటీవలే అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం దానిని చేసి చూపిస్తున్నది.
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని భూస్థాపితం చేయా లని ప్రధాని మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న ఆ పథకాన్ని వదిలించుకోడం అంత తేలిక కాదని కూడా ఆయన గ్రహించారు. అందుకే అవసరమైన నిధులు విడుదల చేయకుండా దానికి నెమ్మది నెమ్మదిగా విషం ఇచ్చి చంపుతూ వచ్చారు. ఇప్పుడు పూర్తిగా తెర దించారు. కోవిడ్ కాలంలో నగరాలు, పట్టణాల నుంచి కాళ్లీడ్చుకుంటూ స్వస్థలాలకు చేరిన అసంఖ్యాక గ్రామీణ యువతకు పనులు కల్పించి ఆదుకున్న ‘నరేగా’ను అంతమొందిస్తున్నందుకు ఇప్పుడి ప్పుడే పల్లెల్లో నిరసన రూపుదిద్దుకుంటున్నది.
మైనారిటీలను దూరం పెట్టి...
స్వతంత్ర భారత రాజ్యాంగంలో బీజేపీకి బొత్తిగా గిట్టని పదాలు సోషలిస్టు, సెక్యులర్. ఈ రెండింటినీ 1976లో అప్పటికాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ‘ప్రవేశిక’లో చేర్చింది. వాటిని సుప్రీంకోర్టు ధ్రువపరిచింది. భావజాలపరంగా, సంకేతాత్మకంగా సోషలిస్టు పదానికి మహాత్మా గాంధీ ‘నరేగా’ ప్రాతినిధ్యం వహి స్తున్నది. దానిని కూల్చివేయడం ద్వారా సోషలిస్టు తరహా వ్యవస్థ మూలాలను బీజేపీ ఛేదించగలిగింది. సెక్యులర్ లక్షణానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న సర్వమత సమభావాన్ని నిర్మూలించాలని ఎదురు చూసిన ఆ పార్టీ అందుకోసం ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను (సర్) ఎంచుకున్నది. సరిహద్దు రాష్ట్రాల్లోకి పొరుగు దేశాల ముస్లింల వలస పరాకాష్ఠకు చేరుకున్నదనే నెపం ఇందు కోసమే దూసుకొచ్చింది. మొత్తం మీద మైనారిటీ ఓటర్లను భారీ ఎత్తున తొలగించడం ద్వారా దేశ లౌకిక లక్షణాన్ని దెబ్బ తీయడానికి బీజేపీ సమకట్టిందనే అభిప్రాయం ధ్రువపడింది.
‘సర్’ మరో ఎన్‌ఆర్‌సి (జాతీయ పౌరసత్వ రిజిస్టర్) అనే విమర్శ బయలుదేరింది. దీని ద్వారా ఓటర్ల జాబితా నుంచి తొల
గించిన మైనారిటీలను విదేశీయులుగా ముద్రవేసి అస్సాంలో మాదిరిగా వెనక్కు పంపిస్తారనే భయాలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీ ఓటర్ల సంఖ్యను తగ్గించడం ద్వారా బీజేపీ తన గెలుపు అవకాశాలను గ్యారంటీ చేసుకుంటున్నది. బహుళత్వ రాజ్యాంగాన్ని హిందూత్వ పాలనాపత్రంగా మార్చివేసే తెగువకు పాల్పడు తున్నది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఉద్దేశించిన త్రిసభ్య కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించినప్పుడే ఎన్నికల యంత్రాంగాన్ని దుర్వినియోగానికి దారి ఏర్పడింది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ, ప్రాణప్రదం అయిన నిష్పాక్షిక ఎన్ని కల వ్యవస్థకు తూట్లుపొడవటం అందువల్లనే సాధ్యమవుతున్నది. దాని విష శిశువే ‘సర్’!
జి. శ్రీరామ్మూర్తి
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


