డబ్బుకు లోకం దాసోం.. వర్తమాన లోకరీతి. సొమ్ములున్న వారికే సకల భోగాలు నయా పోకడ. పాలిటిక్స్‌లోనూ పైసలు ఉన్నోదే రాజ్యం. రాజకీయాల్లోకి రావాలన్నా, నిలబడాలన్నా డబ్బు తప్పనిసరి. తాజాగా జరుగుతున్న బిహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీకి దిగిన వారిలో సంపన్నులు దండిగా ఉన్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తిపరులను అన్ని పార్టీలూ బరిలోకి దింపాయి. గెలుపోటముల మాట ఎలా ఉన్నా, ఎవరు ఎంత సంపన్నులనే అంశం బిహార్ ఓటర్లలో ఆసక్తి రేపుతోంది.
2,616 మంది పోటీ
నామినేషన్ల సమయంలో అభ్యర్థులు స్వయంగా తమ ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించి ప్రజలకు అందుబాటులోకి ఉంచింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,616 మంది అభ్యర్థులలో 2,600 మంది దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. మొత్తం అభ్యర్థులలో 431 మంది జాతీయ పార్టీలకు, 351 మంది రాష్ట్ర పార్టీలకు చెందినవారు. 908 మంది రిజిస్టర్డ్ గుర్తింపు లేని పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 926 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
సింగ్ ఈజ్ కింగ్!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థుల్లో వందల కోట్లకు పైబడిన సంపద కలిసిన వారు పలువురు ఉన్నట్టు ఏడీఆర్ వెల్లడించింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన రణ్ కౌశల్ ప్రతాప్ సింగ్ (Ran Kaushal Pratap Singh) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా ఆయన నిలిచారు. వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ టికెట్‌పై లౌరియా నుంచి పోటీ చేస్తున్న సింగ్.. తన మొత్తం ఆస్తులు రూ.368 కోట్లని ప్రకటించారు. వీటిలో రూ.27 కోట్ల చరాస్తులు, రూ.341 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
రూ.250 కోట్ల సంపద కలిసిన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ నేత నితీష్ కుమార్ (Nitish Kumar) రెండో సంపన్న అభ్యర్థి. గయా జిల్లాలోని గురువా నుంచి ఆయన పోటీలో నిలిచారు. ముంగేర్ జిల్లాకు చెందిన బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ రూ.171 కోట్ల ఆస్తులతో మూడవ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తులలో రూ.1.34 కోట్ల చరాస్తులు, రూ.169 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
స్వతంత్రుల్లో గుప్తా టాప్
స్వతంత్ర అభ్యర్థుల్లో అత్యంత ధనికుడిగా రాజ్ కిషోర్ గుప్తా (Raj Kishor Gupta) నిలిచారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనకు రూ.1.48 కోట్ల చరాస్తులు, రూ.136 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు చూపారు. సివాన్ జిల్లాలోని మహారాజ్‌గంజ్ నుంచి పోటీ చేస్తున్న గుప్తా.. రూ.137 కోట్లతో సంపన్న అభ్యర్థుల్లో నాల్గవ స్థానంలో ఉన్నారు.
పట్నా జిల్లాలోని మోకామా నుంచి పోటీ చేస్తున్న జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థి అనంత్ కుమార్ సింగ్ రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు. వీటిలో రూ.39.7 కోట్ల చరాస్తులు, రూ.60.8 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సంపన్న అభ్యర్థుల్లో ఆయన ఐదవ స్థానంలో నిలిచారు.

షేక్‌పురాలోని బార్బిఘా నుంచి పోటీ చేస్తున్న జేడీ(యు) అభ్యర్థి డాక్టర్ కుమార్ పుష్పంజయ్ రూ.94 కోట్లు, ముంగేర్‌లోని తారాపూర్ ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ కుమార్ రూ.83 కోట్లు, పాట్నా జిల్లాలోని మానేర్ జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి సందీప్ కుమార్ సింగ్ అలియాస్ గోపాల్ సందీప్ సింగ్ రూ.80 కోట్లు, గయా జిల్లాలోని బెలగంజ్ జేడీ(యు) అభ్యర్థి మనోర్మ దేవి రూ. 75 కోట్లు, పశ్చిమ చంపారన్‌లోని నర్కటియాగంజ్ ఆర్జేడీ అభ్యర్థి దీపక్ యాదవ్ రూ. 70 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు.
చదవండి: బిహార్ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నేడు (గురువారం) జరుగుతోంది. రెండో విడత పోలింగ్ ఈ నెల 11న జరుగుతుంది. ఫలితాలు 14న వెలువడతాయి.


