మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులపై విస్తృత చర్చ నిర్వహించాలి
కృష్ణా, గోదావరి జలాలపై బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి
బీఆర్‌ఎస్ హయాంలో చేసిన నిర్ణయాలు, కుదుర్చుకున్న ఒప్పందాలు వివరించాలి
అవసరం అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలన్న ముఖ్యమంత్రి
సచివులతో దాదాపు మూడున్నర గంటల పాటు భేటీ
మరింత కష్టపడితే అత్యధిక పంచాయతీలు వచ్చేవని వ్యాఖ్య
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని సూచన
29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: జల వివాదాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో విస్తృత చర్చ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాలపై బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారాన్ని శాసనసభ వేదికగా ఎండగట్టాలని సహచర మంత్రులకు సూచించారు. బీఆర్‌ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్ తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించి రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని, కృష్ణా జలాలపై హక్కులను రాబట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గతంలో జలాల వినియోగానికి సంబంధించి కేసీఆర్ చేసిన ప్రసంగాలు, వారి హయాంలో చేసిన నిర్ణయాలు, కేంద్రానికి రాసిన లేఖలు, కుదుర్చుకున్న ఒప్పందాలు, బీఆర్‌ఎస్ హ యాంలో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేశారన్న అంశాలను సభకు వివరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ సోమవారం రాత్రి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో దాదాపు మూడున్నర గంటలపాటు మంత్రులతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అంశాలపై దిశానిర్దేశం చేశారు. వీటికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రాజెక్టులపై సమగ్ర చర్చ
తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ, కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న అనుమతులు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను సభలో చర్చకు పెట్టనున్నారు. సాగునీటి రంగం విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో రాష్ట్రానికి జరిగిన నష్టం వి వరించడంతో పాటు బీఆర్‌ఎస్ చేస్తున్న అసత్యాల ను ఎండగట్టాలని నిర్ణయించారు. అవసరం అ యి తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధం కావాలని కూడా సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
మొత్తం 4 రోజులు అసెంబ్లీ
ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని, ఆ తర్వాత జనవరి రెండో తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం నాలుగు రోజులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఇటీవల ముగిసిన పంచాయ తీ ఎన్నికల ఫలితాల సరళి, ఇతర వర్తమాన రాజకీయ అంశాలపై సమావేశంలో విస్తృతంగా చ ర్చించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై సీఎం రేవంత్ సంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు మరికొంత కష్టపడితే సీట్లు పెరిగేవని, కొన్ని జిల్లాల్లో ఇబ్బంది ఎదుర్కొన్న విషయాన్ని, నియోజకవర్గాల వారీగా గెలుచుకున్న పంచాయతీలను మంత్రులకు ముఖ్యమంత్రి వివరించారు. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని సూచించారు. జిల్లాల ఇన్‌చార్జి మంత్రు లే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు బాధ్య త చేపట్టాలని, మొత్తం జెడ్పీలను కైవసం చేసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక జీహెచ్‌ఎంసీలో శివారు మునిసిపాలిటీల విలీనం అనంతరం చేపట్టిన డివిజన్ల పునర్వ్యవస్థీకరణ తీరుతెన్నులను వివరించినట్లు తెలిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించే అంశం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయిద్దామని సీఎంచెప్పినట్టు సమాచారం.


