సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. 3 గంటలపాటు మంత్రులతో సీఎం సమావేశం సాగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం చూపాలని రేవంత్ అన్నారు. అన్ని జడ్పీ పీఠాలను క్లీన్‌స్వీప్ చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రేవంత్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానం చేశారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ పై సమావేశంలో చర్చ జరిగింది.
మంత్రుల సమావేశంలో జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై చర్చ జరిగింది. డివిజన్ల ఏర్పాటుపై మంత్రులకు సీఎం రేవంత్ వివరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులదే బాధ్యతన్న రేవంత్.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజల పూర్తి మద్దతు లభించిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కొందరు కొన్ని పొరపాట్లు చేశారని.. వాటిని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పునరావృత్తం కాకుండా చూసుకోవాలంటూ హెచ్చరించారు.
ఈ నెల 29న అసెంబ్లీ సమావేశం కానుంది. జనవరి 2 నుంచి సమావేశాలను ప్రభుత్వం కొనసాగించనుంది. సమావేశాల్లో ఎంపీటీపీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా చర్చ జరగనుంది. సభలోకి ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ప్రధానంగా గోదావరి కృష్ణా జలాల ఎజెండాగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.


