సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ కమ్లిబాయ్ పెంటయ్య విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన ప్రమాదంలో సౌజన్య (7) అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళితే… ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కమ్లిబాయ్ పెంటయ్య గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సమయంలో చిన్నారి సౌజన్య కారు కిందపడి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాలికను వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో కారే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపించగా, సర్పంచ్ కమ్లిబాయ్ భర్త పెంటయ్య మాత్రం బాలిక కారు కింద పడలేదని వాదిస్తున్నారు. ఈ అంశంపై గ్రామస్థులకు, పెంటయ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో ప్రస్తుతం ఉద్రిక్తత కొంతమేరకు తగ్గినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.


