అన్నాబత్తుని శివకుమార్ ఇంటి వద్ద పోలీసుల హల్‌చల్
హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం
పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు
దీంతో చేసేదిలేక వెనుదిరిగిన పోలీసులు
తెనాలి అర్బన్: ప్రశాంతంగా ఉండే గుంటూరు జిల్లా తెనాలిలో ‘పోలీసుల అత్యుత్సాహంవల్ల’ గురువారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. టుటౌన్ సీఐ రాములు నాయక్ పోలీసులతో మాజీ శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఇంటికి చేరుకుని, మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి ఇక్కడ ఉన్నట్లు సెల్ టవర్ ద్వారా సమాచారం ఉందని, ఇంటిని సోదా చేయాలని డ్రైవర్, వాచ్‌మన్ వద్ద హడావుడి చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న శివకుమార్ ఇంటి బయటకు వచ్చి ఇదేమి పద్ధతని ప్రశ్నించారు.
ఇంతలో మాట మార్చి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని, నోటీసులు తీసుకోవాలంటూ హైడ్రామాకు తెరతీశారు. దీనిని వ్యతిరేకిస్తూ బయటకు నడుచుకుంటూ వస్తున్న ఆయనను సీఐ అడ్డుకుని బయటకు వెళ్ళేందుకు అనుమతి లేదని తెలిపారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని శివకుమార్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తాము పోలీసులమని ఏదైనా చేసే హక్కు ఉంటుందని సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు.
వాగ్వివాదం నడుమ శివకుమార్ తన కారు ఎక్కటంతో సీఐ అడ్డుగా నిలుచున్నారు. అయితే అప్పటికే అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు శివకుమార్‌కు అండగా నిలిచాయి. ఈ క్రమంలో పోలీసుల వలయాన్ని ఆయన ఛేదించి గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. చేసేదిలేక పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయవద్దు: అన్నాబత్తుని
ఈ సందర్భంగా శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రశాంతంగా ఉండే తెనాలి పట్టణాన్ని కలుషితం చేయాలని చూస్తే సహించేది లేదు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో రాజ్యం చేయాలని చేస్తే భయపడే వారు ఎవరు లేరు. ఈ వ్యవహారం మొత్తానికి మంత్రి నాదెండ్ల మనోహర్ బాధ్యత వహించాలి.
వైఎస్సార్‌సీపీ పాలనలో ఇలాంటి వాటికి తావివ్వలేదు. పోలీసులు ఇదేవిధంగా వ్యవహరిస్తే వారి అక్రమాలను బయటపెట్టడానికి కూడా వెనుకాడబోము. ఎవరో మెప్పుకోసం పోలీస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఊరుకోం’ అని స్పష్టం చేశారు. పోలీసుల ప్రవర్తనపై మంత్రి మనోహర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


