గోవా అగ్నిప్రమాద ఘటనలో ప్రధాన నేరారోపణలు ఎదుర్కొంటున్న లుథ్రా బ్రదర్స్‌ను ఎట్టకేలకు థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకొని వారికి సంకెళ్లు వేశారు. ఈ రోజు ఊదయం భారత విదేశాంగ శాఖ సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలిద్దరి పాస్ పోర్టులను సస్పెండ్ చేసిన కొద్దిసేపటికే వారి అరెస్టు జరిగింది.
గత శనివారం గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్‌క్లబ్‌లో అగ్రి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే ఈ క్లబ్ యజమానులైన లూథ్రా బ్రదర్స్ థాయిలాండ్ పరారయ్యారు. దీంతో ప్రమాదంపై తీవ్రంగా స్పందించిన గోవా ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో నిందితులను వదలబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వారి ఇద్దరిపై పోలీసులు లూకౌట్ జారీ చేశారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిద్దరిపై బ్లూకార్నర్ ఇష్యూ చేసింది.
దీంతో థాయిలాండ్ పోలీసులు ఫుకెట్‌లోని ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి బేడీలు వేశారు. కాగా వీరిద్దరిని పట్టుకోవడానికి ఇదివరకే గోవా పోలీసులు థాయిలాండ్‌కు బయిలు దేరినట్లు తెలుస్తోంది.అధికారిక ప్రక్రియ పూర్తయిన అనంతరం వారిద్దరిని గోవా పోలీసులకు అప్పగిస్తున్నట్లు సమాచారం.
భారత్- థాయిలాండ్ దేశాల మధ్య 2013లో ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీ జరిగింది. దీనిప్రకారం ఒక దేశంలో నేరం చేసి మరో దేశంలో తలదాచుకుంటే ఆ నేరస్థులను సంబంధిత దేశానికి అప్పగించాలి. ఈ ఒప్పందానికి అనుగుణంగా ప్రస్తుతం థాయిలాండ్ లూథ్రా బ్రదర్స్‌ను భారత్‌కు అప్పగిస్తుంది. ఈ ఒప్పందం 2015 జున్ 9నుంచి అమలులోకి వచ్చింది.
కాగా ఈ శనివారం అర్థరాత్రి గోవాలోని నైట్ రోమియో నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టాగా క్లబ్‌లో సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో క్లబ్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇది వరకే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


